చిరుత దాడిలో లేగదూడ మృతి.. బిడ్డ కళేబరం వద్ద కంటనీరుతో తల్లడిల్లిన గోమాత..!
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందింది. ఈ ఘటనలో తల్లి గోమాత తన బిడ్డను విడిచిపెట్టలేక కంటతడి పెడుతున్న తీరు అక్కడ ఉన్నవారిని కలచివేసింది. అడవిలో చోటుచేసుకున్న ఈ ఘటన మాతృత్వం విలువలను మరోసారి గుర్తుచేసింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందింది. ఈ ఘటనలో తల్లి గోమాత తన బిడ్డను విడిచిపెట్టలేక కంటతడి పెడుతున్న తీరు అక్కడ ఉన్నవారిని కలచివేసింది. అడవిలో చోటుచేసుకున్న ఈ ఘటన మాతృత్వం విలువలను మరోసారి గుర్తుచేసింది.
బానోతు రాజుకు చెందిన లేగదూడ ఇతర పశువులతో కలిసి అడవిలో మేతకు వెళ్లిన సమయంలో చిరుతపులి దాడికి గురైంది. దాడి తీవ్రత కారణంగా లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది. కొంతసేపటి తర్వాత అడవిలో ఒంటరిగా పడి ఉన్న లేగదూడ కళేబరాన్ని గుర్తించిన గోమాత తన కన్నబిడ్డను చూసి కన్నీరు కార్చుతూ తల్లడిల్లింది.
తల్లి ప్రేమను స్పష్టంగా తెలియజేసేలా గోమాత అక్కడే ఆగకుండా ఇంటికి చేరుకుని యజమాని బానోతు రాజును తచ్చాడుతూ తిరిగి అడవిలోకి తీసుకెళ్లింది. అక్కడ మృతిచెందిన లేగదూడను చూసిన వెంటనే యజమాని చలించిపోయి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పరిశీలన చేపట్టే సమయంలో గోమాత కొద్దిసేపు వారికి దగ్గరికి రానివ్వలేదు. తన బిడ్డ కళేబరాన్ని ముద్దాడుతూ, కంటతడి పెడుతూ అక్కడే నిలిచిపోయింది. బిడ్డను వదలలేక లేగదూడ కళేబరం చుట్టూ తిరుగుతూ విలపించిన తీరు చూసినవారి హృదయాలను కదిలించింది. ఈ ఘటనతో కన్నపేగు బంధం మనుషులకే కాదు, జంతువులకూ అంతే బలంగా ఉంటుందనే విషయం మరోసారి స్పష్టమైంది.
అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో చిరుత సంచారం పెరుగుతున్న నేపథ్యంలో పశువుల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అటవీ శాఖను కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
