TSPSC Group1 Exam: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తు పూర్తయ్యేదాకా ‘టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1’ పరీక్ష వాయిదా!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి దర్యాప్తు పూర్తయ్యేంత వరకు గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరుతూ హైకోర్టులో పిటిషన్లు..
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి దర్యాప్తు పూర్తయ్యేంత వరకు గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. యూపీఎస్సీ లాంటి మూడో సంస్థకు ఈ బాధ్యతను అప్పగించాలని పిటిషనర్లు కోరారు. కాగా గత ఏడాది అక్టోబరులో పరీక్షలు జరిగాక ప్రశ్నపత్రాలు లీక్ వ్యవహారం బయటపడటంతో ఆ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే 49 మంది దాకా అరెస్ట్ చేసింది. దీంతో జూన్ 11న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌స్పీయస్సీ ప్రకటించింది. ఈ పరీక్ష ప్రకటనను రద్దు చేయాలని కోరుతూ అశోక్‌కుమార్, టి.రమేశ్, జె.సుధాకర్‌లు వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై గురువారం జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని, పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రత్యేక సంస్థకు అప్పగించాలని కోరారు. ఓవైపు దర్యాప్తు జరుగుతోందని, నిందితుల వివరాలు పూర్తిగా బయటపడలేదని, అయినా పరీక్ష నిర్వహణకు కమిషన్ సిద్ధపడుతోందన్నారు. 5 లక్షల మంది ఆశావహుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
కమిషన్ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ.. లీకేజీ కేసులో 49 మంది ఉద్యోగులు లేరని, కేవలం ఇద్దరు శాశ్వత, ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారన్నారు. బాధ్యులైనవారినందరినీ సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వారి స్థానంలో కొత్త అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ ఐదో తేదీకి వాయిదా వేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.