WhatsApp Ban: భారతీయులకు షాకిచ్చిన వాట్సాప్.. 99 లక్షల ఖాతాలపై నిషేధం!
WhatsApp Ban: వాట్సాప్.. దీని గురించి తెలియనివారంటూ ఉండరేమో. ఉదయం లేచింది నుంచి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలేవారు ఎందరో ఉన్నారు. వాట్సాప్ లేనిది పనులు జరగని పరిస్థితి కూడా కూడా ఉంది. అయితే వాట్సాప్ భారతీయులకు షాకిచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 99 లక్షలకుపైగా వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. ఎందుకో తెలుసా..?

నంబర్ వన్ మెసేజింగ్ అప్లికేషన్ అయిన వాట్సాప్‌ను నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌కు భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. అయితే, ఇప్పుడు షాకింగ్ సమాచారం బయటపడింది. ఈ ఏడాది జనవరిలో 9.9 మిలియన్ ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తన నెలవారీ నివేదికలో తెలిపింది. పెరుగుతున్న స్కామ్‌లు, స్పామ్, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆపడానికి ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఏదైనా వినియోగదారు నిబంధనలను ఉల్లంఘిస్తే, భవిష్యత్తులో మరిన్ని ఖాతాలు నిషేధించబడతాయని మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ తెలిపింది.
వాట్సాప్ క్రమం తప్పకుండా నివేదికలను అందించాలి:
ఐటీ చట్టం ప్రకారం.. వాట్సాప్ క్రమం తప్పకుండా నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. దీనిలో కంపెనీ తన వినియోగదారులకు సురక్షితమైన, భద్రమైన ప్లాట్‌ఫామ్‌ను అందించడానికి తీసుకున్న చర్యల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 30 వరకు మొత్తం 99 లక్షల 67 వేల ఖాతాలను బ్లాక్ చేసినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో 13.27 లక్షల ఖాతాలను ఎటువంటి ఫిర్యాదు అందకముందే నిషేధించారు. జనవరిలో వాట్సాప్‌కు దాని వినియోగదారుల నుండి 9,474 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 239 ఖాతాలపై కంపెనీ చర్యలు తీసుకుంది. ఖాతాలను బ్లాక్ చేయడంతో సహా ఇతర చర్యలు తీసుకుంది.
కంపెనీ మూడు విధాలుగా ఖాతాలను బ్లాక్ చేస్తుంది:
హానికరమైన కార్యకలాపాలకు పాల్పడే ఖాతాలను గుర్తించి నిషేధించడానికి ఎన్నో రకాలుగా చర్యలు తీసుకుంటుందని వాట్సాప్ తెలిపింది. దీని గుర్తింపు వ్యవస్థ సైన్-అప్ సమయంలో అనుమానాస్పద ఖాతాలను ఫ్లాగ్ చేస్తుంది. అలాగే నిషేధిస్తుంది. ఇంకా ఈ వ్యవస్థ బల్క్ లేదా స్పామ్ సందేశాలను పంపే ఖాతాలను గుర్తించి వాటిని బ్లాక్ చేస్తుంది. మూడవ పద్ధతి వినియోగదారు అభిప్రాయం. వినియోగదారుల నుండి ఫిర్యాదులు వస్తే కంపెనీ దర్యాప్తు చేసి ఖాతాలను బ్లాక్ చేస్తుంది.
మీరు ఈ పనులు చేస్తే మీ ఖాతా బ్లాక్:
మీరు WhatsApp విధానాలను ఉల్లంఘిస్తే, మీ ఖాతాను కూడా బ్లాక్ చేయవచ్చు. చెడు లేదా స్పామ్ సందేశాలను పంపే, మోసానికి ప్రయత్నించే, పుకార్లను వ్యాప్తి చేసే ఖాతాలపై కంపెనీ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. వీటిని వెంటనే బ్లాక్ చేస్తారు. అందుకే మీరు ఎవరికైనా సందేశం పంపే ముందు లేదా వాట్సాప్‌లో ఏదైనా సందేశాన్ని ఫార్వార్డ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే, మీ ఖాతా కూడా నిషేధించవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి