Saturn: శని గ్రహం చుట్టూ ఉండే రింగ్ మాయం! ఇది యుగాంతానికి సంకేతమా?
శని గ్రహం వలయాలు తాత్కాలికంగా అదృశ్యమయ్యాయి. ఇది "రింగ్ ప్లేన్ క్రాసింగ్" అనే ఖగోళ సంఘటన కారణంగా జరిగింది. భూమి శని వలయాల తలానికి సమాంతరంగా ఉన్నందున అవి కనిపించడం లేదు. శని గ్రహం యొక్క 26.7 డిగ్రీల వంపు దీనికి కారణం. ఈ నెల తర్వాత వలయాలు మళ్ళీ కనిపిస్తాయి. ఇది ఏలియన్స్ లేదా యుగాంతానికి సంకేతం కాదు.

సౌర కుటుంబంలో భాగమైన శని గ్రహం, అన్ని గ్రహాల్లోకెల్లా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. దీని చుట్టూ వలయాలు ఉంటాయి. వీటి ఆధారంగా మనం ఇది శనిగ్రహం అని చెప్పేస్తూ ఉంటాం. కానీ, ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. అదేంటంటే.. శనిగ్రహం చుట్టూ ఉండే వలయాలు మాయం అయ్యాయి. ఇది ఒక ఖగోళ వింత. శని గ్రహం చుట్టూ ఉండే వలయాలు మాయం కావడంతో ఇదేమన్న యుగాంతానికి సంకేతమా? లేక ఏలియన్స్ ఏమైనా చేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
నిజానికి అలాటిందేం లేదు.. ఆ వలయాలు ఎక్కడికి పోలేదు.. జస్ట్ మనకు కనిపించవు అంతే. ఎందుకంటే.. ఆ వలయాలు ఇప్పుడు భూమికి సమాంతరంగా ఉన్నాయి. కాస్త ఒంపుగా ఉంటే కనిపించేవి. కానీ, ప్రస్తుతం భూమికి సమాంతరంగా ఉండటంతో అవి అదృష్యమైనట్లు కనిపిస్తున్నాయి. 2009 తర్వాత మొదటిసారిగా ఇలా జరిగింది. “రింగ్ ప్లేన్ క్రాసింగ్” అని పిలువబడే ఈ ఖగోళ వింత తాజాగా సంభవించింది. భూమి, ప్రస్తుతం.. శని వలయ తలం గుండా వెళ్తోంది అందుకే ఆ వలయం కనిపించడంలేదు.
శని గ్రహం 26.7 డిగ్రీల వంపు కారణంగా ఇది జరిగింది. శని గ్రహం సూర్యుని చుట్టూ తిరుగుతుండటంతో వలయాలు దిశను మార్చుకుంటున్నట్లు కనిపిస్తాయి. ప్రతి 13, 15 సంవత్సరాలకు ఒకసారి, శని వలయాలు భూమి దృష్టి రేఖతో సమాంతరంగా రావడంతో ఆ వలయాలు కనిపించవు. చాలా చోట్ల వలయాలు పది మీటర్ల మందం మాత్రమే ఉన్నందున, అంచున చూసినప్పుడు అవి వాస్తవంగా కనిపించవు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. ఈ నెల తర్వాత మళ్లీ శనిగ్రహం వంపు మార్చుకున్న తర్వాత మళ్లీ వలయాలు కనిపిస్తాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.