AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol: ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..? సైన్స్ చెప్పేది తెలుసుకోండి..

లీటరు పెట్రోల్ వంద దాటేసింది.. ఒక్క కిలోమీటర్ మైలేజీ అటు ఇటు అయినా సామాన్యుడి జేబుకు చిల్లు పడాల్సిందే.. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. మధ్యాహ్నం పూట పెట్రోల్ కొట్టిస్తే వేడి వల్ల అది ఆవిరైపోతుందని, అందుకే చల్లగా ఉండే ఉదయం లేదా రాత్రి పూట కొట్టిస్తేనే ఎక్కువ మైలేజీ వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. మరి ఇందులో నిజమెంత? అనేది తెలుసుకుందాం..

Petrol: ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..? సైన్స్ చెప్పేది తెలుసుకోండి..
Petrol-Diesel Price Hike
Krishna S
|

Updated on: May 01, 2026 | 7:07 PM

Share

వాహనదారులందరినీ వేధించే అతిపెద్ద ప్రశ్న మైలేజ్.. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో ప్రతి చుక్కను పొదుపుగా వాడుకోవాలని అందరూ భావిస్తారు. ఈ క్రమంలోనే ఒక ప్రచారం బాగా పాపులర్ అయ్యింది. అదేంటంటే.. “మధ్యాహ్నం పూట ఎండ వేడికి పెట్రోల్ అణువులు వ్యాకోచిస్తాయి..కాబట్టి ఆ సమయంలో పెట్రోల్ కొట్టిస్తే తక్కువ వస్తుంది. అందుకే ఉదయాన్నే లేదా రాత్రి పూట చల్లగా ఉన్నప్పుడు పెట్రోల్ నింపించుకుంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది.” అనే ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎప్పుడైనా ఆలోచించారా?

అసలు ఈ అపోహ ఎందుకు పుట్టింది..?

సైన్స్ ప్రకారం.. ద్రవ పదార్థాలు వేడికి వ్యాకోచిస్తాయి, చలికి సంకోచిస్తాయి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఇంధనం డెన్సిటీ తగ్గుతుంది. అంటే ఒక లీటర్ పరిమాణం ఉన్న పెట్రోల్, వేడి వల్ల కొద్దిగా విస్తరిస్తుంది. దీని వల్ల మనం డబ్బులు లీటరుకు చెల్లించినా, వాస్తవానికి మనం పొందే ఇంధన శక్తి తక్కువగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. అందుకే చల్లని సమయాల్లో సాంద్రత ఎక్కువగా ఉంటుందని భావించి అప్పుడు పెట్రోల్ కొట్టిస్తుంటారు.

భూగర్భ ట్యాంకుల రహస్యం..

బయటి వాతావరణంలో ఉష్ణోగ్రత మారుతున్న మాట వాస్తవమే కానీ, పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని నిల్వ చేసే విధానం వేరుగా ఉంటుంది.

అండర్ గ్రౌండ్ స్టోరేజ్: పెట్రోల్ పంపుల్లో ఇంధన ట్యాంకులన్నీ భూమికి చాలా అడుగుల లోతులో ఉంటాయి.

స్థిరమైన ఉష్ణోగ్రత: భూమి లోపల ఉష్ణోగ్రత బయటి ఎండ లేదా చలితో సంబంధం లేకుండా ఎప్పుడూ దాదాపు ఒకేలా ఉంటుంది.

నో ఇంపాక్ట్: ట్యాంకుల నుంచి పైపుల ద్వారా బయటకు వచ్చే వరకు పెట్రోల్ ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు రాదు. కాబట్టి మీరు మధ్యాహ్నం 12 గంటలకు పెట్రోల్ కొట్టించినా, తెల్లవారుజామున 5 గంటలకు కొట్టించినా మీకు అందే ఇంధన పరిమాణం, సాంద్రతలో ఎలాంటి తేడా ఉండదు.

సాంద్రత ఎందుకు ముఖ్యం..?

పెట్రోల్ బంక్ వద్ద ఉండే డెన్సిటీ గేజ్ మనం గమనించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..

పెట్రోల్ సాంద్రత: 730 నుండి 800 kg/m³ మధ్య ఉండాలి.

డీజిల్ సాంద్రత: 830 నుండి 900 kg/m³ మధ్య ఉండాలి.

ఒకవేళ ఇందులో భారీ మార్పులు ఉంటే, అది ఉష్ణోగ్రత వల్ల కాదు, ఇంధనంలో కలుషితాలుఉన్నాయని అర్థం.

నిజంగా మైలేజ్ పెరగాలంటే ఏం చేయాలి..?

పెట్రోల్ కొట్టించే సమయం కంటే, మీ వాహన నిర్వహణే మైలేజీని నిర్ణయిస్తుంది.

టైర్ ప్రెజర్: టైర్లలో గాలి తక్కువగా ఉంటే ఇంజిన్‌పై భారం పడి మైలేజ్ తగ్గిపోతుంది. వారానికోసారి తనిఖీ చేయండి.

నెమ్మదైన డ్రైవింగ్: హఠాత్తుగా బ్రేకులు వేయడం, ఒక్కసారిగా యాక్సిలరేషన్ ఇవ్వడం వల్ల ఇంధనం వృథా అవుతుంది.

సర్వీసింగ్: ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ సమయానికి మార్చకపోతే వాహనం ఎక్కువ పెట్రోల్‌ను లాగేస్తుంది.

సరైన గేర్: వేగానికి తగినట్లుగా గేర్లు మార్చడం ద్వారా ఇంజిన్ పనితీరు మెరుగుపడుతుంది.

“ఉదయం పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ వస్తుంది” అనేది కేవలం ఒక శాస్త్రీయ అపోహ మాత్రమే. భూగర్భ ట్యాంకుల వల్ల సమయంతో సంబంధం లేకుండా ఇంధన నాణ్యత ఒకేలా ఉంటుంది. కాబట్టి సమయం గురించి ఆందోళన చెందడం మానేసి, వాహన కండిషన్, డ్రైవింగ్ అలవాట్లపై శ్రద్ధ పెట్టడం ద్వారా మాత్రమే మీరు ఇంధనాన్ని ఆదా చేయగలరు.

Follow Us