AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాగర గర్భంలో భారత్ ‘సైలెంట్ కిల్లర్’.. డ్రాగన్ గుండెల్లో మొదలై వణుకు..!

భారతదేశ రక్షణ రంగ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం మొదలైంది. హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్థాన్ వంటి శత్రు దేశాల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ తన అమ్ములపొదిలో నాలుగవ అణు క్షిపణి జలాంతర్గామిని (SSBN) సిద్ధం చేస్తోంది. 'అరిహంత్ క్లాస్' ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకున్న 'INS అరిసూదన్' (S4) ప్రస్తుతం సముద్ర గర్భంలో తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకునే తుది దశ పరీక్షల్లో నిమగ్నమై ఉంది.

సాగర గర్భంలో భారత్ ‘సైలెంట్ కిల్లర్’.. డ్రాగన్ గుండెల్లో మొదలై వణుకు..!
Ins Arisudan (feature Image)
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: May 21, 2026 | 1:29 PM

Share

భారతదేశ రక్షణ రంగ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం మొదలైంది. హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్థాన్ వంటి శత్రు దేశాల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ తన అమ్ములపొదిలో నాలుగవ అణు క్షిపణి జలాంతర్గామిని (SSBN) సిద్ధం చేస్తోంది. ‘అరిహంత్ క్లాస్’ ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకున్న ‘INS అరిసూదన్’ (S4) ప్రస్తుతం సముద్ర గర్భంలో తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకునే తుది దశ పరీక్షల్లో నిమగ్నమై ఉంది.

విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ (SBC) వేదికగా తయారైన ఈ జలాంతర్గామి, 2025 డిసెంబర్ చివరి నాటికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ పరీక్షలు విజయవంతమైతే, 2027 ప్రారంభం నాటికి ఇది అధికారికంగా భారత నౌకాదళంలోకి చేరుతుంది. ఇదివరకే ఏప్రిల్ 2026లో ‘INS అరిధామన్’ను సైలెంట్‌గా కమిషన్ చేసిన భారత రక్షణ శాఖ, ఇప్పుడు అరిసూదన్‌పై పూర్తి దృష్టి సారించింది.

INS అరిసూదన్ రాకతో భారతదేశానికి ‘Continuous At-Sea Deterrence’ (CASD) హోదా లభిస్తుంది. రక్షణ పరిభాషలో ఇది ఒక కీలక మైలురాయి. దీంతో భారత్ వద్ద ప్రస్తుతం మొత్తం 4 అణు జలాంతర్గామిలు అరిహంత్, అరిఘాత్, అరిధామన్, అరిసూదన్ ఉంటాయి. దీనివల్ల ఏడాది పొడవునా, రోజులో 24 గంటలూ కనీసం ఒక అణు జలాంతర్గామి సముద్ర గర్భంలో అణు క్షిపణులతో గస్తీ కాస్తూనే ఉంటుంది. శత్రువు అకస్మాత్తుగా దాడి చేసినా, సముద్రం లోపల దాగి ఉన్న మన జలాంతర్గామి తక్షణమే ‘సెకండ్ స్ట్రైక్’ (ద్వారా శత్రువును నామరూపాలు లేకుండా చేయగలదు.

అరిసూదన్ ప్రత్యేకత ఏమిటంటే దీని శబ్దం (Noise levels) చాలా తక్కువ. సముద్ర గర్భంలో శత్రు దేశాల సోనార్ వ్యవస్థలకు దొరకకుండా ఇది అత్యంత రహస్యంగా ఆపరేషన్స్ నిర్వహించగలదు. ఇందులో వాడిన అధునాతన రాడార్, సోనార్ వ్యవస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉన్నాయి. ఈ జలాంతర్గామి తన ట్రయల్స్ పూర్తి చేసుకున్న తర్వాత, విశాఖపట్నం సమీపంలోని రాంబిల్లి వద్ద నిర్మిస్తున్న ‘INS వర్ష’ స్థావరానికి చేరుకోనుంది. ఇది ఒక భూగర్భ బేస్, ఇక్కడ ఉపగ్రహాల కళ్ళకు కూడా చిక్కకుండా జలాంతర్గామిలను భద్రపరచవచ్చు.

మొదటి తరం జలాంతర్గామిలతో పోలిస్తే, అరిసూదన్ అత్యంత ఆధునికమైనది, రెట్టింపు శక్తివంతమైనది. తమ మొదటి తరం జలాంతర్గామిలైన అరిహంత్, అరిఘాత్‌లతో పోలిస్తే అరిసూదన్ అత్యంత భారీగా, రెట్టింపు విధ్వంసక సామర్థ్యంతో రూపుదిద్దుకుంది.

అరిహంత్-స్ట్రెచ్ డిజైన్: ఇది INS అరిహంత్ కంటే సుమారు 10 మీటర్లు ఎక్కువ పొడవును కలిగి ఉంది. దీని బరువు దాదాపు 7,000 టన్నులు.

రెట్టింపు వినాశకర శక్తి: ఇందులో వర్టికల్ లాంచ్ సిస్టమ్ (VLS) కు చెందిన 8 మిసైల్ ట్యూబ్‌లు ఉన్నాయి (మొదటి రెండు జలాంతర్గామిలలో కేవలం 4 మాత్రమే ఉన్నాయి). ఇది ఒకేసారి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగల 8 ‘K-4’ క్షిపణులను, 750 కిలోమీటర్ల పరిధి గల 24 ‘K-15’ సాగరిక క్షిపణులను మోసుకెళ్లగలదు.

80% పైగా స్వదేశీ సాంకేతికత: ‘మేడ్ ఇన్ ఇండియా’ సంకల్పానికి నిదర్శనంగా ఈ అణు జలాంతర్గామిలోని 80 శాతానికి పైగా విడిభాగాలు పూర్తిగా భారతదేశంలోనే తయారయ్యాయి.

నెక్స్ట్-జనరేషన్ రియాక్టర్: ఇందులో అప్‌గ్రేడ్ చేసిన 83 మెగావాట్ల (MW) కాంపాక్ట్ లైట్-వాటర్ రియాక్టర్‌ను అమర్చారు. దీని ‘అకౌస్టిక్ సిగ్నేచర్’ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల శత్రువుల సోనార్ కళ్లకు దొరకకుండా సముద్ర గర్భంలో ఇది అత్యంత నిశ్శబ్దంగా ప్రయాణించగలదు.

భవిష్యత్తుకు పునాది: ఈ సబ్‌మెరైన్ విజయం.. భవిష్యత్తులో భారత్ నిర్మించబోయే మరింత శక్తివంతమైన ‘S5-క్లాస్’ అణు జలాంతర్గామిల ప్రాజెక్టుకు బలమైన పునాదిగా మారనుంది.

INS అరిసూదన్ కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు, అది భారత ఆత్మనిర్భరతకు నిదర్శనం. ఇది విజయవంతంగా సేవల్లోకి రావడం ద్వారా భవిష్యత్తులో నిర్మించబోయే భారీ S5-క్లాస్ జలాంతర్గామిల ప్రాజెక్టుకు మార్గం సుగమం అవుతుంది. అణు త్రయం భూమి, ఆకాశం, నీటిలో ముఖ్యంగా సముద్ర విభాగం మరింత బలోపేతం కావడంతో, భారత్ ఇప్పుడు గ్లోబల్ సూపర్ పవర్స్ సరసన సగర్వంగా నిలుస్తోంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us