Hockey Women World Cup: విజయం ముగింట బోల్తాపడిన భారత మహిళా హాకీ జట్టు.. క్రాస్‌ఓవర్ ఆశలు సజీవం..
భారత జట్టు న్యూజిలాండ్‌పై గెలిచే అవకాశం ఉంది.. లేదా కనీసం డ్రా అయినా చేసే అవకాశం పలు మార్లు భారత ముంగిట నిలిచాయి. అయినప్పటికీ భారత మహిళలు తమకు అందివచ్చిన చాలా అవకాశాలను వదులుకున్నారు

Hockey Women World Cup: ఎఫ్‌ఐహెచ్ మహిళల ప్రపంచకప్ పూల్-బిలో భారత మహిళల హాకీ జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో 3-4 తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. అయితే.. ఈ మ్యాచ్ లో పరాజయంపొందినప్పటికీ భారత జట్టు గ్రూప్ పూల్-బిలో మూడో స్థానంలో నిలిచింది. దీంతో క్రాస్‌ఓవర్‌కు చేరుకోగలిగింది. భారత జట్టుకు వరుసగా మూడో మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవకాశం లభించినా జట్టు అవకాశాన్ని చేజార్చుకుంది. పూల్-బిలో న్యూజిలాండ్ జట్టు 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ జట్టు 4 పాయింట్లతో న్యూజిలాండ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. భారత్, చైనాలు చెరో 2 పాయింట్లు సాధించాయి. మెరుగైన గోల్ తేడాతో భారత్ క్రాస్ ఓవర్ కు అర్హత సాధించింది.
నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు పూల్ బిలో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం నాలుగు పూల్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. అయితే రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు క్రాస్ ఓవర్ ఆడాల్సి ఉంటుంది. క్రాస్ ఓవర్ మ్యాచ్‌లలో గెలిచిన జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
15 పెనాల్టీలు.. ఒకటి మాత్రమే గోల్ భారత జట్టు న్యూజిలాండ్‌పై గెలిచే అవకాశం ఉంది.. లేదా కనీసం డ్రా అయినా చేసే అవకాశం పలు మార్లు భారత ముంగిట నిలిచాయి. అయినప్పటికీ భారత మహిళలు తమకు అందివచ్చిన చాలా అవకాశాలను వదులుకున్నారు. 15 పెనాల్టీ కార్నర్లలు లభించగా.. భారత జట్టు ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు కోసం.. ఆదివారం స్పెయిన్‌లోని తెరెసాలో జరిగే క్రాస్‌ఓవర్‌లో పూల్ సిలో రెండవ స్థానంలో నిలిచిన జట్టుతో భారత్ తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. అప్పుడు భారత మహిళలు ప్రపంచ కప్ లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంటారు. భారత్ తరఫున వందన కటారియా 4వ నిమిషంలో, లాల్‌రెమ్సియామి 44వ నిమిషంలో, గుర్జిత్ కౌర్ 59వ నిమిషంలో గోల్స్ చేయగా, న్యూజిలాండ్ తరఫున 12, 54 నిమిషాల్లో ఒలివియా మేరీ, 29వ నిమిషంలో టెస్సా యోప్, 32వ నిమిషంలో ఫ్రాన్సిస్ డేవిస్ గోల్స్ చేశారు.




మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




