Watch Video: లేడీ ధోనీ.. రెప్పపాటులో స్టంపింగ్.. బ్యాటర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన టీమిండియా కీపర్.. వైరల్ వీడియో
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళా వికెట్ కీపర్ యస్తికా భాటియా వికెట్ల వెనుక ఎంఎస్ ధోనీ కంటే చురుకుదనం ప్రదర్శించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.
ఎంఎస్ ధోని స్పీడ్, వికెట్ల వెనుక స్పందించే సమయం అందరికీ తెలిసిందే. రెప్పపాటు వ్యవధిలో బ్యాట్స్‌మెన్‌ను చాలాసార్లు పెవిలియన్ చేర్చాడు. ఔటైన విషయం కొన్ని క్షణాల వరకు బ్యాటర్లకు కూడా తెలియదు. అలాంటి వేగంతో షాకిస్తుంటాడు మన మిస్టర్ కూల్. అయితే, ఈ విషయం ఇప్పుడు ఎందుకు గుర్తుచేస్తున్నారు అని అనుకుంటున్నారా.. ధోనీ లాగే మరో భారత కీపర్ అద్భుతంగా, అతే వేగంగా స్పందించి, ఓ బ్యాటర్‌ను పెవిలియన్ చేర్చడంతో నెట్టింట్లో చర్చల్లో నిలిచింది. అందుకే ఈ భారత మహిళ క్రికెటర్‌ను ధోనితో పోల్చుతూ, నెటిజన్లు పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. అసలు మ్యాటర్ అదన్నమాట. యాస్తికా భాటియా చేసిన అద్భుతం ధోనీని మరోసారి గుర్తు చేసింది. భాటియాకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భాటియా వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకుంది. తన వేగంతో అనుష్క సంజీవనిని పెవిలియన్‌కు పంపింది.
రెప్పపాటులో బ్యాట్స్‌మెన్‌కు షాక్..
భాటియా ఏం చేసిందో, భారత ఆటగాళ్లతో పాటు శ్రీలంక ప్లేయర్లు కూడా అర్థం చేసుకోలేకపోయారు. రీప్లే చూసిన థర్డ్ అంపైర్ అనుష్క రనౌట్ అయినట్లు ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. 25 పరుగుల వద్ద అనుష్క రనౌట్ అయింది. వాస్తవానికి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 173 పరుగులు చేసింది. అనుష్క 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగింది. 23వ ఓవర్‌లో దీప్తి శర్మ వేసిన మూడో బంతికి అనుష్క రివర్స్ స్వీప్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఆమె తన షాట్‌ను క్షణాల్లోనే మార్చుకుంది. దీంతో బంతి ఆమె నుంచి చాలా దూరం వెళ్లలేకపోయింది.
Brilliant glove work by Yastika Bhatia in the second ODI. pic.twitter.com/FKLoT23q63
— Johns. (@CricCrazyJohns) July 4, 2022
అయితే, ఆమె షాట్ ఆడే క్రమంలో క్రీజు దాటి కొద్దిగా ముందుకు వచ్చింది. బహుశా ఆమె క్రీజులో లేదని ఆమెకు కూడా తెలియకపోవచ్చు. అది గమనించే సమయానికి చాలా ఆలస్యం అయింది. సరిగ్గా ఇలాంటి అవకాశం ఎదురుచూసిన యస్తిక.. వేగంగా స్పందించి స్టంప్స్‌పై బంతిని విసిరింది. దీంతో షాకవుతూ బ్యాటర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత్‌కు 174 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని, రెండో వన్డేలో విజయం సాధించింది. స్మృతి మంధాన 94 పరుగులు, షెఫాలీ వర్మ 71 పరుగులతో ఆకట్టుకున్నారు.