INDW vs ENGW 2021: ఏడేళ్ల తర్వాత బరిలోకి మిథాలీ సేన; ఏకైక టెస్టులో ఇంగ్లండ్ తో తలపడనున్న భారత్

INDW vs ENGW 2021: ఇంగ్లండ్ లో ఓవైపు శుక్రవారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌ మెన్స్‌ టీంలు తలపడనున్నాయి.

INDW vs ENGW 2021: ఏడేళ్ల తర్వాత బరిలోకి మిథాలీ సేన; ఏకైక టెస్టులో ఇంగ్లండ్ తో తలపడనున్న భారత్
Indw Vs Engw 2021
Venkata Chari

| Edited By: Janardhan Veluru

Jun 16, 2021 | 11:22 AM

England Women vs India Women 2021: ఇంగ్లండ్ లో ఓవైపు శుక్రవారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌ మెన్స్‌ టీంలు తలపడనున్నాయి. మరోవైపు నేటి (బుధవారం) నుంచి ఇంగ్లండ్ మహిళలతో భారత మహిళల టీం ఏకైక టెస్టులో తలపడేందుకు సిద్ధమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ టెస్టు మ్యాచ్‌ కోసం భారత మహిళలు ఆత్మ స్థైర్యంతో బరిలోకి దిగనున్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తరువాత భారత మహిళలు టెస్టు మ్యాచ్‌ ఆడనున్నారు. 2014 నుంచి భారత్ టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. ఇంత గ్యాప్‌ తరువాత బరిలోకి దిగనుండడంతో మిథాలీ సేన ఎలా ఆడబోతుందనే ఆసక్తి నెలకొంది. బ్రిస్టల్‌లో బుధవారం నుంచి ప్రారభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మిథాలీ సేన సర్వశక్తులను ఒడ్డేందుకు సిద్ధమైంది. ఈమ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇంతకుముందు భారత మహిళలు ఆడిన మూడు టెస్టుల్లోనూ విజయం సాధించారు. ఈ టెస్టు మ్యాచ్‌లో భారత మహిళలు గెలిస్తే.. నాలుగో విజయంతో చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. మరోవైపు ఈ మధ్య ఇంగ్లండ్ ఆడిన మూడు టెస్టుల్లో పై చేయి సాధించింది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగనుందనడంలో సందేహం లేదు.

టీమిండియాకు సీనియర్లే దిక్కా.. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ కోసం 18 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అయితే అంతా కలిపి కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. ఈ మేరకు టీమిండియా చూపు సీనియర్లవైపు ఉంది. ఈ మ్యాచ్‌లో వీరే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కెప్టెన్‌ మిథాలీ రాజ్, పేసర్‌ జులన్‌ గోస్వామి మిగతా సభ్యులను ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఇక బ్యాటింగ్‌లో మిథాలీ రాజ్ కీలకంగా మారింది. మిథాలీ నిలదొక్కుకుంటే పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో జులన్‌ కీలకమే అయినా.. ఆమె చాలా కాలంగా సుదీర్ఘమైన స్పెల్‌లు వేయలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలా ఆడనుందో చూడాలి మరి.

బ్యాటింగ్‌లో మిథాలీకి తోడు హర్మన్‌ ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ ఉన్నారు. అలాగే దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌ గా జట్టుకు అండగా ఉంది. స్పిన్నర్‌గా పూనమ్‌ యాదవ్‌ తో పాటు పేస్ బౌలింగ్‌లో శిఖా పాండే, అరుంధతి రెడ్డి ఉన్నారు. అయితే వీరిలో ఎవరు తుది జట్టులో ఆడనున్నారో చూడాలి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత మహిళలకు తగినంత ప్రాక్టీస్‌ లభించలేదు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

ఇంగ్లండ్ టీం అంతా అనుభవజ్ఞులే… ఇంగ్లండ్‌ టెస్టు జట్టులో15 మందిలో 11 మంది అనుభవజ్ఞులే ఉన్నారు. వీరంతా కలిసి 47 టెస్టు మ్యాచ్‌లు ఆడి మంచి ఫామ్‌లో ఉన్నారు. గత మూడు టెస్టుల్లో ఉన్నవారే ప్రస్తుత జట్టుతో బరిలోకి దిగనున్నారు. ఇంగ్లీష్ కెప్టెన్‌ హీతర్‌నైట్, నటాలీ స్కివర్, ఓపెనర్‌ బీమాంట్, ఆల్‌రౌండర్‌ బ్రంట్‌లు కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. బౌలింగ్ పరంగా ష్రబ్‌సోల్, కేట్‌ క్రాస్‌, సోఫీ ఎకెల్‌స్టోన్‌ సమర్ధంగా రాణిస్తున్నారు. వీరంతా ఫామ్‌ కొనసాగిస్తే.. భారత మహిళలు చెమటోడ్చాల్సిందే.

మీకు తెలుసా?

  • దాదాపు ఏడేళ్ల తరువాత మిథాలీ సేన బరిలోకి దిగుతున్నా.. చివరిగా ఆడిన మూడు టెస్టుల్లో విజయం సాధించింది. ఈ మూడు విజయాల్లో రెండు ఇంగ్లండ్‌పైన ఇంగ్లండ్‌లోనే సాధించడం విశేషం.
  • ఇప్పటి వరకు సొంతగడ్డపై ఇంగ్లండ్‌ టీం భారత్‌పై గెలవలేదు.

టీం సభ్యులు భారత మహిళలు: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, పునం రౌత్, ప్రియా పునియా, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, స్నేహ రానా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, జులన్‌ గోస్వామి, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాధా యాదవ్

ఇంగ్లండ్ మహిళలు: హీథర్ నైట్ (కెప్టెన్), ఎమిలీ అర్లోట్, టామీ బ్యూమాంట్, కేథరీన్ బ్రంట్, కేట్ క్రాస్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, జార్జియా ఎల్విస్, నటాషా ఫర్రాంట్, అమీ జోన్స్, నటాలీ సైవర్, అన్య ష్రబ్‌సోల్, మాడి విల్లియర్స్, ఫ్రాన్ విల్సన్ , లారెన్ విన్ఫీల్డ్-హిల్

Also Read:

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఆటగాళ్లు సెంటిమెంట్‌కు బలవుతారా..? లేక సరికొత్త రికార్డులను సృష్టిస్తారా?

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu