WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఆటగాళ్లు సెంటిమెంట్‌కు బలవుతారా..? లేక సరికొత్త రికార్డులను సృష్టిస్తారా?
టీమిండియాకు న్యూజిలాండ్‌తో ఓ ప్రమాదం పొంచి ఉంది. అదే ఐసీసీ సెంటిమెంట్. ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించలేదు.
WTC Final: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జూన్ 18 న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చారిత్రాత్మక ఫైనల్ కోసం న్యూజిలాండ్ విజయంతో ముందడుగు వేస్తుండగా.. కేవలం ప్రాక్టీస్ మ్యాచ్‌తోనే బరిలోకి దిగనుంది మెన్ ఇన్ బ్లూ టీం. అయితే, టీమిండియాకు న్యూజిలాండ్‌తో ఓ ప్రమాదం పొంచి ఉంది. అదే సెంటిమెంట్. ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్‌పై టీమిండియా గెలవలేదు. దీంతో పాటు డబ్ల్యూటీసీ లోనూ భారత జట్టు కివీస్‌పై విజయం సాధించలేదు. దీంతో సెంటిమెంట్ బలంగా పనిచేస్తే.. టీమిండియాకు ఓటమి తప్పదని ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు.
ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ రెండేళ్లుగా సాగుతోంది. ఈ సుదీర్ఘమైన టోర్నీలో టీమిండియా.. న్యూజిలాండ్ టీం మినహా అన్ని టీంలపైనా విజయ ఢంకా మోగించింది. అయితే, ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కివీస్ జట్టుతోనే తలపడనుండడంతో.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి మరి. ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు టీంల విజయాలను ఓసారి పరిశీలిద్దాం…
2000 ఐసీసీ నాకౌట్ సిరీస్ లో.. టీమిండియాకు తొలిసారి న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది ఈ టోర్నీలోనే. సౌరభ్ గంగూలీ సారథ్యంలో టీమిండియా 2000 సంవత్సరంలో ఐసీసీ నాకౌట్ సిరీస్‌లో పాల్గొంది. టోర్నీ మొత్తం గంగూలీ సేన అద్భుతంగా ఆడి ఫైనల్ చేరింది. కానీ, ఫైనల్లో మాత్రం 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
స్కోర్లు: ఇండియా: 50 ఓవర్లలో 264/6 ( గంగూలీ 117, సచిన్ 69) న్యూజిలాండ్: 49.4 ఓవర్లకు 265/6 (క్రిస్‌కేర్న్స్ 102 నాటౌట్, క్రిస్ హారిస్ 46)
2016 టీ20 ప్రపంచ కప్‌లో.. 2016లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఒకే గ్రూప్‌లో బరిలోకి దిగాయి. లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. రెండో సారి కూడా న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు పరాభవం తప్పలేదు. తక్కువ స్కోర్ చేయలేక భారత్ బ్యాట్స్‌మెన్‌లు చేతులెత్తేశారు.
స్కోర్లు: న్యూజిలాండ్: 20 ఓవర్లకు 126/7 (కొరే అండర్సన్ 34, , లూక్ రోంచి 21) ఇండియా: 18.1 ఓవర్లలో 79/10 ( కోహ్లీ 23, ధోనీ 30)
2019 వరల్డ్ కప్ లో.. ముచ్చటగా మూడోసారి 2019లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈసారి కూడా అదృష్టం కివీస్ వైపే నిలిచింది. సెమీఫైనల్ లో తక్కువ స్కోర్‌కే న్యూజిలాండ్‌ను కట్టడి చేసినా.. టీమిండియా టాప్ ఆర్డర్ చేతులెత్తేయండంతో ఓటమి తప్పలేదు.
స్కోర్లు: న్యూజిలాండ్: 50 ఓవర్లకు 239/8 (రాస్ టేలర్ 74, , కేన్ విలియమ్సన్ 67) ఇండియా: 49.3 ఓవర్లలో 221/10 ( జడేజా 77, ధోనీ 50)
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో.. గతేడాది టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ లో భాగంగా రెండు టెస్టుల సిరీస్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అప్పటి వరకు అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయించిన టీమిండియా… న్యూజిలాండ్‌పై మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. రెండు టెస్టుల్లో ఘోర పరాజయం చవిచూసింది. తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత్, రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.
దీంతో ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా గెలవలేదనే అంశానికి బలం చేకూరినట్లైంది. దీంతో సెంటిమెంట్‌ను అధిగమించి డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా ఎలా ఆడనుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఇప్పటికే న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌పై రెండు టెస్టుల సిరీస్‌లో తలపడి, 1-0 తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. మరోవైపు టీమిండియా మాత్రం కేవలం ప్రాక్టీస్ మ్యాచ్‌తోనే డబ్ల్యూటీసీ ఫైనల్ లో బరిలోకి దిగనుంది.
జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ తరువాత టీమిండియా ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
Also Read: