Cricket World Cup 2023: రోహిత్ శర్మ, షమిలను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
రోహిత్ సేన ఆతిథ్య జట్టుగా ఉన్న అనుకూలతలను సద్వినియోగం చేసుకుని.. వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని సగటు భారతీయ క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. చివరగా 2011లో వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఒక ఐసీసీ టైటిల్ మాత్రమే గెలుచుకుంది. 2013లో ఛాంపియన్ ట్రోఫీని భారత జట్టు గెలుచుకుంది.

ICC Cricket World Cup 2023: క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో మరో రసవత్తర పోరుకు చెన్నై వేదికకానుంది. భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆదివారంనాడు జరగనుంది. వరల్డ్ కప్‌పై కన్నేసిన ఇరు జట్లకు ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. టోర్నీలో శుభారంభంతో సత్తా చాటాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. రోహిత్ సేన ఆతిథ్య జట్టుగా ఉన్న అనుకూలతలను సద్వినియోగం చేసుకుని.. వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని సగటు భారతీయ క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. చివరగా 2011లో వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఒక ఐసీసీ టైటిల్ మాత్రమే గెలుచుకుంది. 2013లో ఛాంపియన్ ట్రోఫీని భారత జట్టు గెలుచుకుంది. వరల్డ్ కప్‌పై భారత జట్టు కన్నేసిన నేపథ్యంలో ఈ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
- 1 – రోహిత్ శర్మ ఒక సెంచరీని సాధిస్తే.. ఇప్పటి వరకు వరల్డ్ కప్ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన వరల్డ్ ఆటగాడిగా రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. వరల్డ్ కప్ 1992 నుంచి ప్రపంచ కప్ 2011 వరకు జరిగిన 6 టోర్నీల్లోనూ కనిపించిన సచిన్ మొత్తం 44 వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో సచిన్ 2278 పరుగులతో పాటు 6 సెంచరీలు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అత్యధిక సెంచరీల రికార్డు కావడం విశేషం. అయితే వరల్డ్ కప్ 2019 టోర్నీలో 5 సెంచరీలతో చెలరేగిన రోహిత్ శర్మ.. మొత్తం 6 సెంచరీలతో సచిన్ రికార్డును సమం చేశాడు. కానీ ఈ సారి మరో సెంచరీ బాది.. ఆ రికార్డును పూర్తిగా తన సొంతం చేసుకోవాలనే యోచనలో ఉన్నాడు.
- 3 – అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు రోహిత్ శర్మ మరో మూడు సిక్సర్లు బాదాల్సి ఉంది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో మరో మూడు సిక్సర్లు బాదితే వెస్టిండీస్ లెజెండరీ ఓపనర్ గ్రిస్ గేల్ (553) సిక్సర్ల రికార్డును హిట్ మ్యాన్ తన పేరిట తిరగరాసుకుంటాడు.
- 665- భారత ఆటగాడు సుభ్‌మన్ గిల్‌ను వరల్డ్ కప్ టోర్నీ ఓ రికార్డు ఊరిస్తోంది. సుభ్‌మన్ గిల్ 665 పరుగులు సాధిస్తే.. ఒక కేలండర్ సంవత్సరంలో వన్డే ఫార్మెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశముంది. ఇప్పటి వరకు ఈ రికార్డు సచిన్ టెండుల్కర్ (1,894) పేరిట ఉంది.
- 13- వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు భారత ఫేసర్ షమి మరో 13 వికెట్లు సాధించాల్సి ఉంది. భారత మాజీ ఫేసర్లు జహీర్ ఖాన్ (44), జవగల్ శ్రీనాథ్ (44) ఇద్దరి పేరిట ప్రస్తుతం ఈ రికార్డు ఉంది.
- 2- టీమిండియా ఈ సారి వరల్డ్ కప్ టోర్నీని గెలుచుకుంటే.. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా అరుదైన రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటి వరకు వరుసగా రెండోసారి ఏ ఆతిథ్య జట్టూ వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకోలేదు. 2011లో వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకోగా.. ఈసారి కూడా వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తుండటం తెలిసిందే.
మరిన్ని క్రికెట్ వరల్డ్ కప్ వార్తలు చదవండి..




