Hyderabad: ఇక 100 రోజులే.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలకు కౌంట్‌డౌన్ షురూ.. ఢిల్లీలో కర్టైన్ రైజర్ ఈవెంట్
తెలంగాణ ప్రభుత్వం, ఏబీబీ ఫార్ములా, గ్రీన్‌కో సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఫార్ములా వరల్డ్ ఛాంపియన్ షిప్ రేస్ జరగనుంది. ఇప్పటికే ఈ అంతర్జాతీయ పోటీల నిర్వహణకు తెలంగాణ సర్కారు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు వేదిక కానుంది. దేశంలోనే మొదటిసారిగా నిర్వహిస్తోన్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలకు మన భాగ్యనగరం ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, ఏబీబీ ఫార్ములా, గ్రీన్‌కో సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఫార్ములా వరల్డ్ ఛాంపియన్ షిప్ రేస్ జరగనుంది. ఇప్పటికే ఈ అంతర్జాతీయ పోటీల నిర్వహణకు తెలంగాణ సర్కారు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. నెక్లెస్‌రోడ్డులోని 2.7 కి.మీ మార్గంలో రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి వెళ్లేవిధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. మొత్తం 17 మలుపులు వచ్చేవిధంగా ట్రాక్ ప్లాన్ రూపొందింస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక రేస్ లో ప్రపంచంలోని పలు ఆటోమొబైల్ సంస్థలు పాల్గొననున్నాయి. ఈ రేస్‌కు సంబంధించి శనివారం (నవంబర్ 5) ఢిల్లీలో కర్టెన్ రైజర్ ప్రోగ్రాంను నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని ది అశోకా హోటల్ లాన్‌లో సాయంత్రం 7గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది.
ఎలక్ర్టిక్ వాహనాల హబ్‌గా..
కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగే తొలి రేసుతో ఫార్ములా ఈ భారత్‌లోకి అడుగుపెట్టనుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ జిల్లాలో ఉన్న బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో అక్టోబరు 2013లో చివరి ఫార్ములా 1 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ జరిగింది. ఆతర్వాత ఒక అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ జరగడం దేశంలో ఇదే మొదటిసారి. కాగా పర్యావరణ అనుకూలమైన మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములా ఇ అధికారులు ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ)పై సంతకం చేశారు. తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఫార్ములా E రేస్ చాలా దోహదం చేస్తుందని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఫార్ములా E సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘ హైదరాబాద్ వేదికగా ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించేందుకు మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. హైదరాబాద్, సావో పాలోలో ఇ-ప్రిక్స్‌తో ఆల్-ఎలక్ట్రిక్ స్ట్రీట్ రేసింగ్ అంతర్జాతీయ సరిహద్దులను మేం కొనసాగిస్తాం. అదే సమయంలో జకార్తా, సియోల్‌తో పాటు దిరియా, మెక్సికో సిటీ, బెర్లిన్, మొనాకో, రోమ్, లండన్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన రేసులను కొనసాగిస్తాం’ అని తెలిపారు.
80 నుంచి 90 కోట్లతో..
కాగా ఈ పోటీల నిర్వహణకు ప్రపంచంలో మొత్తం 12 ప్రతిష్ఠాత్మక నగరాలను ఎంపిక చేస్తే..భారత్‌లో హైదరాబాద్‌కు ఫార్ములా-ఈ ప్రిక్స్-2023 చోటు దక్కింది. అందుకే తెలంగాణ సర్కారు కూడా ఈ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రేసింగ్ జరిగే 2.37 కి.మీల ట్రాక్‌ను ఫార్ములా-ఈ నిబంధనలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. దాదాపు 50వేల మంది అభిమానులు రేసును స్వయంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రెండు రోజుల పాటు జరిగే రేసుకు దాదాపు రూ.80 నుంచి రూ.90 కోట్ల ఖర్చు అవుతుందని తెలుస్తోంది.
We’re 100 days away from our first EVER race in India ??
Get to know our host city for Round 4 of Season 9 ⚡@TAGHeuer
— ABB FIA Formula E World Championship (@FIAFormulaE) November 4, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..