‘ఈ సాలా కప్ నమ్ దే’ అనకుండా కోహ్లీ నన్ను అడ్డుకున్నాడు: ఫైనల్‌కు ముందే బాంబ్ పేల్చిన మాజీ ప్లేయర్
IPL 2025: ఆర్‌సీబీకి ఒకప్పుడు దురదృష్టం వెంటాడినా, ఈసారి మాత్రం అంచనాలను మించి రాణించింది. 'ఈ సాలా కప్ నమ్ దే' అనే నినాదం లేకుండానే, ఆర్‌సీబీ అభిమానులు తమ జట్టుకు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. ఈసారి ఫైనల్‌లో ట్రోఫీని గెలిచి, తమ దీర్ఘకాల నిరీక్షణకు తెర దించుతుందని వారు ఆశిస్తున్నారు.

Virat Kohli: ఐపీఎల్ అంటేనే ఉత్సాహం, ఆర్‌సీబీ అంటేనే ‘ఈ సాలా కప్ నమ్ దే’ అనే నినాదం. కానీ, ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవడంతో, ఆర్‌సీబీ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. విరాట్ కోహ్లీ తనను ‘ఈ సాలా కప్ నమ్ దే’ అనే పదాన్ని వాడకుండా నిషేధించినట్లు డివిలియర్స్ వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు.
కోహ్లీ ఆదేశం వెనుక ఆంతర్యం?
ప్రతి సీజన్‌లోనూ ఆర్‌సీబీ అభిమానులు ‘ఈ సాలా కప్ నమ్ దే’ (ఈ సంవత్సరం కప్పు మనదే) అంటూ తమ జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటారు. కానీ, 17 ఏళ్లుగా ఆర్‌సీబీకి ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ నినాదం ఆశలను పెంచడం తప్ప, ఫలితాలను ఇవ్వడం లేదనే భావన కొంతమందిలో ఉంది. బహుశా అందుకే, ఈసారి ఫైనల్‌కు చేరుకున్న వేళ, గతంలో జరిగిన పరాజయాల జ్ఞాపకాలను దూరం చేసి, కేవలం వర్తమానంపై దృష్టి సారించాలని విరాట్ కోహ్లీ భావించి ఉండవచ్చు.
డివిలియర్స్ మాట్లాడుతూ, “నేను ఒకసారి ‘ఈ సాలా కప్ నమ్ దే’ అన్నాను, వెంటనే విరాట్ నుంచి నాకు సందేశం వచ్చింది. దయచేసి ఇకపై ఆ పదాన్ని ఉపయోగించవద్దని అతను చెప్పాడు. నేను కొంచెం ఇబ్బందిపడ్డాను. కానీ నిజం చెప్పాలంటే, ప్రతిసారీ ట్రోఫీ ఈ సీజన్‌లో వస్తుందని చెప్పి చెప్పి నేను కూడా అలసిపోయాను” అని పేర్కొన్నారు. అయితే, ఈసారి ఆర్‌సీబీ కచ్చితంగా కప్ గెలుస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నానని డివిలియర్స్ తెలిపారు. ఒకవేళ ఆర్‌సీబీ గెలిస్తే, తాను కూడా సంబరాలు చేసుకోవడానికి భారత్‌కు వస్తానని హామీ ఇచ్చారు.
ఆర్‌సీబీ ప్రస్థానం – ఈసారి ఫైనల్‌కు ఎలా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు (2009, 2011, 2016) ఫైనల్‌కు చేరుకుంది. కానీ, ప్రతిసారి రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. ఈసారి పంజాబ్ కింగ్స్‌ను క్వాలిఫైయర్ 1లో ఓడించి, తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ బ్యాట్‌తో అదరగొట్టగా, జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా సమిష్టిగా రాణించారు. గతంలో కోహ్లీ, క్రిస్ గేల్ వంటి ఒకటి, ఇద్దరు ఆటగాళ్లపై ఆధారపడిన జట్టు, ఈసారి సమష్టి ప్రదర్శనతో ముందుకు సాగింది. బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారింది.
ఆర్‌సీబీకి ఒకప్పుడు దురదృష్టం వెంటాడినా, ఈసారి మాత్రం అంచనాలను మించి రాణించింది. ‘ఈ సాలా కప్ నమ్ దే’ అనే నినాదం లేకుండానే, ఆర్‌సీబీ అభిమానులు తమ జట్టుకు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. ఈసారి ఫైనల్‌లో ట్రోఫీని గెలిచి, తమ దీర్ఘకాల నిరీక్షణకు తెర దించుతుందని వారు ఆశిస్తున్నారు. డివిలియర్స్ మాటలు ఆర్‌సీబీ అభిమానులలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈసారి కప్పు గెలిస్తే, విరాట్ కోహ్లీతో కలిసి ట్రోఫీని ఎత్తాలనేది తన కోరిక అని డివిలియర్స్ స్పష్టం చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








