Shubman Gill : గిల్ ఆరోగ్య పరిస్థితి పై ఉత్కంఠ.. గౌహతి టెస్ట్ ఆడతాడా, లేదా? బీసీసీఐ తాజా అప్డేట్ ఇదే
భారత టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ మెడ గాయంపై తాజాగా ఒక ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. గిల్ వేగంగా కోలుకుంటున్నారని జట్టుతో కలిసి గౌహతి వెళ్తున్నారని బీసీసీఐ మీడియాకు తెలియజేసింది. ఈనెల 22న గౌహతిలో భారత్, సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ ఆడనుంది.

Shubman Gill : భారత టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ మెడ గాయంపై తాజాగా ఒక ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. గిల్ వేగంగా కోలుకుంటున్నారని జట్టుతో కలిసి గౌహతి వెళ్తున్నారని బీసీసీఐ మీడియాకు తెలియజేసింది. ఈనెల 22న గౌహతిలో భారత్, సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ ఆడనుంది. అయితే గిల్ ఆ మ్యాచ్ ఆడతాడా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపిన వివరాల ప్రకారం.. గిల్ ఆడాలా వద్దా అనే నిర్ణయం మ్యాచ్‌కి ఒకరోజు ముందు అంటే నవంబర్ 21న తీసుకుంటారు.
శుభమాన్ గిల్ కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. అతని మెడకు తీవ్రంగా నరాల నొప్పులు రావడంతో, గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి గిల్‌ను ఐసీయూలో కూడా ఉంచారు. అయితే మరుసటి రోజునే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గిల్ గౌహతి టెస్ట్ ఆడతాడా లేదా అనే నిర్ణయం చివరి నిమిషంలోనే వెల్లడి కానుంది.
గిల్ ప్లేసులో ఎవరు?
శుభమన్ గిల్ ఆడకపోతే అతని స్థానంలో ఎవరు ఆడతారు అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కోల్‌కతాలో మొదటి టెస్ట్ ఓడిపోయిన తర్వాత టీమ్ ఇండియా ప్రాక్టీస్ చేసింది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో సాయి సుదర్శన్ ఎక్కువగా నెట్స్ లో చెమటోడ్చాడు. దీంతో అతనికి గిల్ స్థానంలో అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. అయితే నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులో ఉన్నాడు. ఒకవేళ సుదర్శన్‌కు అవకాశం ఇస్తే జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ల సంఖ్య పెరిగిపోతుంది. ఇది సౌతాఫ్రికా స్పిన్నర్‌లకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. మరోవైపు నితీష్ రెడ్డి కూడా ఇటీవల మంచి ఫామ్‌లో లేడు. ఈ పరిస్థితుల్లో కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
భారత్‌కు కీలకమైన రెండో టెస్ట్
భారత జట్టు ఇప్పటికే ఈ సిరీస్‌లో మొదటి టెస్ట్‌ను కోల్‌కతాలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. సౌతాఫ్రికా స్పిన్నర్ల ముందు భారత బ్యాట్స్‌మెన్‌లు విఫలం కావడం ఈ ఓటమికి ప్రధాన కారణం. టీమ్ ఇండియా సిరీస్‌లో 0-1 తో వెనుకబడి ఉంది. ఈ దశలో గౌహతిలో జరిగే రెండో టెస్ట్‌లో ఏమాత్రం పొరపాటు జరిగినా, సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా, టీమ్ మేనేజ్‌మెంట్ మరియు ఆటగాళ్లు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి గిల్ ఆడతాడా లేదా అనే విషయంపై తీసుకునే నిర్ణయం, అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఈ మ్యాచ్ ఫలితంపై చాలా ప్రభావం చూపవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




