Ricky Ponting: షేన్ వార్న్‌ను గుర్తు చేసుకుంటూ ఏడ్చిన రికీ పాంటింగ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ ఇంటర్వ్యూలో షేన్ వార్న్‌కు సంబంధించిన స్టోరీ గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. దుఖాన్ని ఆపుకోలేకపోయాడు.
Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ ఇంటర్వ్యూలో షేన్ వార్న్‌కు సంబంధించిన స్టోరీ గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. దుఖాన్ని ఆపుకోలేకపోయాడు. దీనిని బట్టి షేన్ వార్న్, పాంటింగ్ మధ్య సంబంధం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా దిగ్గజ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ మార్చి 4న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అతని ఆకస్మిక మరణం క్రికెట్ అభిమానులని దిగ్భ్రాంతికి గురిచేసింది. 52 ఏళ్ల వార్న్ ఇలా వెళ్లడం అందరిని బాధించింది. పాంటింగ్ మాట్లాడుతూ.. వార్న్ మరణవార్త తెలియగానే తాను షాక్‌కి గురైనట్లు చెప్పాడు. తన సహచరుడు, మంచి స్నేహితుడు ఈ ప్రపంచంలో లేడని చెప్పడంతో నమ్మడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. పాంటింగ్ ఇలా అన్నాడు. “ఉదయం ఈ వార్త తెలియగానే నేను షాక్ అయ్యాను. నెట్‌బాల్ కోసం నా కుమార్తెలను తీసుకువెళ్లాలని అనుకున్నాను. అందుకోసం ఉదయమే లేచేసరికి వార్న్ మరణ వార్త తెలిసింది. కానీ అది నిజమని నమ్మలేకపోయాను” అన్నాడు.
అంతకుముందు పాంటింగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసాడు. అందులో షేన్ వార్న్ మరణంపై ఇలా రాశాడు. “దీనిని మాటల్లో వర్ణించడం కష్టం. నేను 15 సంవత్సరాల వయస్సులో అకాడమీలో ఉన్నప్పుడు మొదటిసారి వార్న్‌ని కలిశాను. మేము ఒక దశాబ్దానికి పైగా సహచరులం. అన్ని ఒడిదుడుకులను కలిసి తట్టుకున్నాం. వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలి” అని రాశాడు.