IPL 2025: రాహుల్ ద్రవిడ్ కు గాయం.. రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురుదెబ్బ! ఫ్రాంచైజీ కీలక అప్డేట్
IPL 2025 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయపడటంతో శిక్షణ శిబిరానికి దూరమయ్యారు. అయితే త్వరలోనే కోలుకుని జట్టుతో చేరతారని ఫ్రాంచైజీ ప్రకటించింది. మరోవైపు, 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ ఎంపిక కావడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అతని ప్రతిభను ప్రశంసించిన కెప్టెన్ సంజు సామ్సన్, వైభవ్ గొప్ప హిట్టర్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు.

IPL 2025 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయం కారణంగా ప్రీ-సీజన్ శిక్షణ శిబిరానికి దూరంగా ఉన్నారు. బెంగళూరులో క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆయన కాలికి గాయమైందని, కానీ త్వరలోనే జట్టుతో చేరతారని ఫ్రాంచైజీ ధృవీకరించింది. సోషల్ మీడియాలో ఆర్‌ఆర్ పోస్ట్ చేసిన ఫోటోలో, ద్రవిడ్ ఎడమ కాలు గాయంతో ఉన్నప్పటికీ, కోలుకుంటున్నారని, త్వరలో జైపూర్‌లో జట్టులో చేరతారని ఫ్రాంచైజీ తెలిపింది. “బెంగళూరులో క్రికెట్ ఆడుతున్నప్పుడు గాయపడిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ త్వరగా కోలుకుంటున్నారు. త్వరలోనే మాతో జైపూర్‌లో చేరతారు” అని రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్రకటించింది.
టీమిండియాతో కలిసి T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత, IPL 2025 వేలానికి ముందు ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా తన బాధ్యతలను పూర్తిచేసుకున్న తర్వాత, ఆయన ఐపీఎల్‌కు తిరిగి రావడం ఫ్రాంచైజీకి పెద్ద ఊరటగా మారింది. అయితే ప్రీ-సీజన్ శిక్షణకు గాయంతో దూరంగా ఉండడం జట్టుకు స్వల్ప నష్టమే అయినప్పటికీ, త్వరలోనే జట్టుతో కలవబోతుండటం సానుకూల సంకేతం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అతి పిన్న వయస్కుడైన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ ద్వారా ఎంపిక చేయబడ్డాడు. అతని ప్రతిభను గమనించిన రాజస్థాన్ కెప్టెన్ సంజు సామ్సన్ అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా, అతని సిక్స్-హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ, అతడు “కొన్ని పంచ్‌లు వేయడానికి సిద్ధంగా ఉన్నాడని” సామ్సన్ వ్యాఖ్యానించాడు.
IPL 2024 మెగా వేలంలో రూ.1.1 కోట్లకు రాయల్స్ ఫ్రాంచైజీ వైభవ్‌ను కొనుగోలు చేయడం ఒక సంచలనంగా మారింది. 2011 మార్చి 27న బీహార్‌లో జన్మించిన వైభవ్, ఈ జాబితాలో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయసులో జనవరి 2024లో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. గత సంవత్సరం భారత U19 జట్టుతో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లో సెంచరీ కొట్టడం అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
2024-25 ACC అండర్ 19 ఆసియా కప్‌లో, వైభవ్ సూర్యవంశీ 5 మ్యాచ్‌ల్లో 176 పరుగులతో ఏడవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..