AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : ఐపీఎల్ 2026 ముంగిట ధోనీ మాస్టర్ క్లాస్.. వైరల్ అవుతున్న వీడియో

MS Dhoni : ఐపీఎల్ 2026 కోసం ధోనీ వికెట్ కీపింగ్ స్కూల్ ప్రారంభమైంది. సీఎస్‌కే యువ కీపర్లు కార్తీక్ శర్మ, ఉర్విల్ పటేల్‌లకు థలా నెట్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పిస్తున్నారు. సీఎస్‌కే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

MS Dhoni  : ఐపీఎల్ 2026 ముంగిట ధోనీ మాస్టర్ క్లాస్.. వైరల్ అవుతున్న వీడియో
Ms Dhoni
Rakesh
|

Updated on: Mar 26, 2026 | 1:16 PM

Share

MS Dhoni : ఐపీఎల్ 2026 సందడి మొదలైందో లేదో, అప్పుడే మన థలా ఎంఎస్ ధోనీ తనదైన శైలిలో రంగంలోకి దిగారు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడం ఒక ఎత్తయితే, వికెట్ల వెనుక ధోనీ చేసే మ్యాజిక్ మరో ఎత్తు. క్రికెట్ పుస్తకాల్లో కూడా లేని విన్యాసాలను వికెట్ కీపింగ్‌లో చూపెట్టే ధోనీ, ఇప్పుడు యువ ఆటగాళ్లకు గురువుగా మారారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) క్యాంప్‌లో ధోనీ వికెట్ కీపింగ్ స్కూల్ మొదలైంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోను సీఎస్‌కే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ షేర్ చేసిన వీడియోలో ధోనీ తన జట్టులోని ఇద్దరు యువ వికెట్ కీపర్లకు ట్రైనింగ్ ఇస్తూ కనిపించారు. వారే కార్తీక్ శర్మ, ఉర్విల్ పటేల్. వీరిద్దరూ మైదానంలో విధ్వంసకర బ్యాటింగ్‌కు పేరుగాంచినప్పటికీ, ధోనీ పాఠశాలలో మాత్రం వికెట్ కీపింగ్‌లో మెళకువలు నేర్చుకుంటూ కనిపించారు. ధోనీ ప్రతి మాటను వారు ఎంతో ఏకాగ్రతతో వింటున్నారు. మ్యాచ్ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ల వెనుక ఎలా చురుగ్గా ఉండాలి, బ్యాటర్ కదలికలను బట్టి ఎలా స్పందించాలి అనే విషయాలపై ధోనీ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు.

సాధారణంగా ప్రతి ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ధోనీ చుట్టూ చేరి సలహాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి సీజన్ మొదలవ్వకముందే తన సొంత జట్టు ఆటగాళ్లను ధోనీ తీర్చిదిద్దుతున్నారు. ఉర్విల్, కార్తీక్ ఇద్దరూ క్రీజులో భారీ షాట్లు కొట్టడానికి ఇష్టపడతారు, కానీ ధోనీ మాత్రం వారి కీపింగ్ నైపుణ్యాలను సానబెడుతున్నారు. ధోనీ దగ్గర శిక్షణ పొందిన ఈ యువ ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం వస్తే వికెట్ల వెనుక ధోనీ స్థాయి ప్రదర్శన చేయడానికి సిద్ధమవుతున్నారు.

వికెట్ కీపర్‌గా ఐపీఎల్‌లో ధోనీకి సాటి ఎవరూ లేరు. ఈ లీగ్‌లో 200 కంటే ఎక్కువ వికెట్లు (క్యాచ్‌లు + స్టంపింగ్‌లు) తీసిన ఏకైక కీపర్‌గా ధోనీ చరిత్ర సృష్టించారు. చెన్నై సూపర్ కింగ్స్ మరియు గతంలో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ తరపున ఆడుతూ ఆయన ఈ ఘనత సాధించారు. ఆయన స్టంపింగ్ వేగం మెరుపు కంటే వేగంగా ఉంటుందని క్రికెట్ దిగ్గజాలే చెబుతుంటారు. ఇప్పుడు అదే వేగాన్ని, నైపుణ్యాన్ని తన తర్వాతి తరం ఆటగాళ్లకు ధోనీ వారసత్వంగా అందిస్తున్నారు.

ప్రస్తుతానికి కార్తీక్, ఉర్విల్ మాత్రమే ధోనీ దగ్గర ట్రైనింగ్ పొందుతున్నట్లు కనిపిస్తున్నా, టోర్నమెంట్ సాగుతున్న కొద్దీ ఇతర జట్ల కీపర్లు కూడా ధోనీ పాఠశాలలో చేరడం ఖాయం. ప్రతి ఏటా ధోనీ ఇచ్చే టిప్స్ యువ క్రికెటర్ల కెరీర్‌ను మార్చేస్తుంటాయి. ఐపీఎల్ 2026లో ధోనీ కేవలం ఆటగాడిగానే కాకుండా ఒక మెంటార్‌గా, గైడ్‌గా తన ముద్ర వేయబోతున్నారు. సీఎస్‌కే ఫ్యాన్స్ కూడా తమ అభిమాన ఆటగాడిని ఇలా కోచ్ అవతారంలో చూడటం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us