AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check : భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెటర్ల మధ్య ఘర్షణ?.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వైరల్ వీడియో

Fact Check : ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026 లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక సంచలన వీడియో బయటకు వచ్చింది.. పిచ్ మధ్యలో పాక్ ప్లేయర్ భారత బ్యాటర్‌పై దాడి చేసినట్లు ఉన్న ఆ క్లిప్ ఇరు దేశాల అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Fact Check :  భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెటర్ల మధ్య ఘర్షణ?.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వైరల్ వీడియో
India Vs Pakistan Women
Rakesh
|

Updated on: Jun 16, 2026 | 9:49 AM

Share

Fact Check : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను కళ్లు మూసుకుని నమ్మే పరిస్థితి లేదు. తాజాగా ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఇంటర్నెట్‌లో ఒక వింత వీడియో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో ఒక పాకిస్తానీ మహిళా క్రికెటర్ మైదానం మధ్యలోనే భారత బ్యాటర్ పైకి దూసుకెళ్లి దాడి చేస్తున్నట్లు, వెంటనే అంపైర్లు, ఇతర ఆటగాళ్లు వచ్చి వారిద్దరినీ పట్టుకుని విడదీస్తున్నట్లు కనిపించింది.

ఈ ఘర్షణకు సంబంధించిన విజువల్స్ నెట్టింట ప్రత్యక్షం కావడంతో ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు మొదలయ్యాయి. అసలు మ్యాచ్‌లో ఇలాంటి ఘోరమైన ఘటన నిజంగానే జరిగిందా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలపై లోతుగా విచారించగా అసలు నిజం బయటపడింది. ఈ వైరల్ వీడియో పూర్తిగా నకిలీది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి ఎవరో ఆకతాయిలు కల్పితంగా సృష్టించిన క్లిప్ ఇదని, మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఎలాంటి గొడవ లేదా భౌతిక దాడులు జరగలేదని నిర్ధారణ అయింది.

నిజానికి బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించగా, చివర్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలిష్టమైన స్కోరును అందించింది.

ఆ తర్వాత 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ తన కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ లైనప్‌ను దెబ్బతీసింది. ఫలితంగా పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 106 పరుగులకే పరిమితమై 64 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు మెగా టోర్నీలో శుభారంభం చేసింది.

మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దీప్తి శర్మ మాట్లాడుతూ.. తన ప్రదర్శనకు జట్టు సభ్యుల సహకారమే కారణమని, దేవుడి దయ వల్ల అనుకున్న సమయానికి వికెట్లు తీసి జట్టును గెలిపించగలిగానని సంతోషం వ్యక్తం చేసింది. భారత్-పాక్ మధ్య జరిగిన ఈ పోరును ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వీక్షించడంతో మహిళా క్రికెట్ గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన మ్యాచ్‌గా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. మైదానంలో ఎంతో స్నేహపూర్వకంగా ముగిసిన ఈ మ్యాచ్‌ను కొంతమంది సైబర్ అల్లరి మూకలు వ్యూస్ కోసం ఏఐ ద్వారా ఫేక్ వీడియోగా మార్చి ప్రచారం చేశారని క్రీడా వర్గాలు స్పష్టం చేశాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us