CWG 2026 : తండ్రి బ్రాంజ్ కొడితే.. కొడుకు సిల్వర్ కొట్టాడు.. కామన్వెల్త్ గేమ్స్‌లో విజయనగరం కుర్రాడి సంచలనం
CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లూరి అజయ్ బాబు రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. 2010లో తండ్రి గెలిచిన కాంస్య పతకాన్ని అధిగమిస్తూ, విజయనగరం కుర్రాడు దేశం గర్వించేలా కామన్వెల్త్ వేదికపై తెలుగు జెండాను ఎగురవేశాడు.

CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026 వేదికగా స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న పోటీల్లో భారత క్రీడాకారులు రికార్డుల మోత మోగిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల యంగ్ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు అద్భుత ప్రదర్శనతో దేశానికి రజత (సిల్వర్) పతకాన్ని అందించాడు. పురుషుల 79 కేజీల విభాగంలో బరిలోకి దిగిన అజయ్ బాబు, మొత్తం 330 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇందులో స్నాచ్ రౌండ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 181 కిలోల బరువు ఎత్తాడు. అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను ఎగురవేస్తూ అతను సాధించిన ఈ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
33 మంది వెయిట్‌లిఫ్టర్లను అందించిన ఆ ఊరి నుంచే..
అజయ్ బాబు 2004 నవంబర్ 22న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామానికి క్రీడల్లో ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఏకంగా 33 మంది వెయిట్‌లిఫ్టర్లను దేశానికి అందించిన ఘనత ఈ ఊరి సొంతం. అందులో 22 మంది జాతీయ స్థాయిలో ఆడగా, 13 మంది అంతర్జాతీయ వేదికలపై తమ ముద్ర వేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వెయిట్‌లిఫ్టర్ల గని అని కూడా పిలుస్తారు. కొండవెలగాడతో పాటు గోడాలం, ఆముదాలవలస వంటి గ్రామాల నుంచి ఇప్పటివరకు ఎంతో మంది నేషనల్, ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టర్లు తయారయ్యారు.
తండ్రి కాంస్యం.. కొడుకు రజతం
అజయ్ బాబుకు వెయిట్‌లిఫ్టింగ్ అనేది రక్తంలోనే ఉండి వారసత్వంగా వచ్చింది. అతని తండ్రి వలురి శ్రీనివాసరావు కూడా ఒక ప్రముఖ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీనివాసరావు భారత్ తరఫున కాంస్య (బ్రాంజ్) పతకం సాధించారు. 2015లో తండ్రి శిక్షణలోనే అజయ్ బాబు తొలిసారి వెయిట్‌లిఫ్టింగ్‌లో ఓనమాలు దిద్దాడు. ఇప్పుడు 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో తండ్రి గెలిచిన బ్రాంజ్ మెడల్ రంగును మారుస్తూ అజయ్ బాబు ఏకంగా రజత పతకం గెలుచుకోవడం ఒక అరుదైన, భావోద్వేగమైన ఘట్టంగా నిలిచింది.
రికార్డులతో మొదలైన పతకాల ప్రయాణం
అజయ్ బాబు క్రీడా ప్రస్థానంలో 2023 ఖేలో ఇండియా గేమ్స్ అతిపెద్ద మలుపుగా నిలిచాయి. ఆ పోటీల్లో తన కేటగిరీలో నేషనల్ రికార్డు సాధిస్తూ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. దాంతో భారత జట్టులో చోటు లభించింది. 2024లో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్, సీనియర్ విభాగాల్లో ఏకకాలంలో స్వర్ణాలు సాధించి సంచలనం సృష్టించాడు. అదే ఏడాది ఏషియన్ యూత్ అండ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. ఇక 2025లో అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో 335 కేజీలు ఎత్తి ఆల్‌టైమ్ ఛాంపియన్‌షిప్ రికార్డుతో గోల్డ్ కొట్టాడు. ఆ రికార్డు విజయమే అతనికి నేడు 2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ టికెట్ అందించడమే కాకుండా, దేశం గర్వించేలా సిల్వర్ మెడల్ తెచ్చిపెట్టింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
