Mohammed Shami : భారీగా భరణం డిమాండ్ చేస్తున్న భార్య.. కూతురు పుట్టినరోజున షమీ ఆవేదన
భారత క్రికెటర్ మహ్మద్ షమీ తన కూతురు అయరా 10వ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన మాజీ భార్య హసిన్ జహాన్‌తో కొనసాగుతున్న భరణం వివాదం నేపథ్యంలో షమీ ఈ సందేశాన్ని పంచుకున్నారు. నెటిజన్లు ఆ పోస్టుపై వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Mohammed Shami : భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ షమీ వ్యక్తిగత జీవితం ఎన్నో వివాదాలతో ముడిపడి ఉంది. తన భార్య హసిన్ జహాన్ తో విడిపోయిన తర్వాత, కూతురు అయరా తల్లి వద్దే ఉంటోంది. అయితే, జూలై 17న అయరా తన 10వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, షమీ తన కూతురు కోసం చాలా ఎమోషనల్ పోస్ట్ చేశారు. అకస్మాత్తుగా వేరుపడిన తమ జీవితాన్ని, తన కూతురితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ షమీ ఓ మెసేజ్ పంచుకున్నారు. మహ్మద్ షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురు అయరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని అందమైన చిత్రాలను పంచుకున్నారు. ఆ పోస్ట్‌లో, “డియర్ డాటర్, మనం మేల్కొని, మాట్లాడుకుంటూ, నవ్వుతూ గడిపిన రాత్రులు, ముఖ్యంగా నీ డ్యాన్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. నువ్వు ఇంత వేగంగా పెరుగుతున్నావని నమ్మలేకపోతున్నాను. నీ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ దేవుడు నీకు ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు!” అని రాశారు.
గతంలో కూడా షమీ తన కూతురిని చాలా కాలం తర్వాత కలిసినప్పుడు ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో తండ్రీకూతుళ్లు కలిసి ఒక మాల్‌లో షాపింగ్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోకు “చాలా కాలం తర్వాత ఆమెను మళ్ళీ చూసినప్పుడు కాలం ఆగిపోయింది. నిన్ను మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను, బేబో,” అని క్యాప్షన్ ఇచ్చారు. మహ్మద్ షమీ, అతని భార్య హసిన్ జహాన్ విడిగా నివసిస్తున్నారు. వారి కూతురు తన తల్లితో ఉంటోంది.
మహ్మద్ షమీ 2014లో హసిన్ జహాన్‌ను వివాహం చేసుకున్నారు. 2015లో వారికి అయరా జన్మించింది. అయితే, 2018లో హసిన్ జహాన్ షమీపై తీవ్ర ఆరోపణలు చేయడంతో వారి బంధం కేవలం మూడేళ్లు మాత్రమే కొనసాగింది. జహాన్, షమీ తనను లైంగికంగా వేధించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌లో కూడా పాల్గొన్నాడని ఆరోపించారు. ఈ వివాదం తర్వాత, ఆమె తన కూతురితో కలిసి కోల్‌కతాకు వెళ్లిపోయింది.
మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్, అతడి నుంచి నెలకు రూ.10 లక్షలు భరణం డిమాండ్ చేస్తోంది. నెలకు రూ.4 లక్షలు తక్కువ మొత్తమని ఆమె వాదిస్తోంది. కలకత్తా హైకోర్టు ఇటీవల షమీకి తన భార్యకు నెలకు రూ.1.5 లక్షలు, కూతురికి నెలకు రూ.2.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీనిపై హసిన్ జహాన్ పీటీఐతో మాట్లాడుతూ.. “షమీ అహ్మద్ జీవనశైలికి నెలకు రూ.4 లక్షలు చాలా తక్కువ. ఏడేళ్ల క్రితం, మేము నెలకు రూ.10 లక్షలు డిమాండ్ చేశాం. ఇప్పుడు వస్తువుల ధరలు కూడా పెరిగాయి కాబట్టి, ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




