MI vs RCB : హార్దిక్ అవుట్.. సూర్య ఇన్.. రాయ్‌పూర్ పోరులో ముంబై కొత్త ప్లాన్
MI vs RCB : ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్‌పై ముంబై కీలక అప్‌డేట్ ఇచ్చింది. సూర్య జట్టులోకి వస్తుండగా హార్దిక్ రాకపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది.

MI vs RCB : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం (మే 10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య రాయ్‌పూర్ వేదికగా హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ కీలక పోరుకు ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు ఒక తీపి కబురు, ఒక చేదు వార్త వినిపించింది. జట్టు స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి చేరుతుండగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాకపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గత కొద్దిరోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మే 7న సూర్య భార్య దేవిషా శెట్టి ఆడపిల్లకు జన్మనివ్వడంతో, ఆయన తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఈ సంతోష సమయంలో కుటుంబంతో గడిపేందుకు ఆయన గత మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. అయితే, ఆర్సీబీతో జరగబోయే కీలక మ్యాచ్ కోసం సూర్య తిరిగి జట్టుతో చేరబోతున్నారని ముంబై ఇండియన్స్ ప్రతినిధి అధికారికంగా వెల్లడించారు. సూర్య రేపు వస్తున్నారని చెప్పడంతో ఆయన ప్లేయింగ్-11లో ఉండటం ఖాయమని తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ పై వీడని ఉత్కంఠ
మరోవైపు ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హార్దిక్ అనారోగ్యం కారణంగా బరిలోకి దిగలేదు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, వైద్య బృందం ఆయన ఫిట్‌నెస్‌ను నిశితంగా గమనిస్తోందని టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ముంబై ఎయిర్‌పోర్టులో జట్టుతో పాటు హార్దిక్ కనిపించకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. ఒకవేళ హార్దిక్ ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో లేకపోతే, సూర్యకుమార్ యాదవే మళ్ళీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ముంబై వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి?
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ లేకపోవడంతో ముంబై జట్టు కొంత తడబడింది. ఇప్పుడు సూర్య రావడంతో బ్యాటింగ్ లైనప్ బలోపేతం కానుంది. రాయ్‌పూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో, ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోవడానికి ముంబై గట్టి ప్రణాళికలతో సిద్ధమవుతోంది. హార్దిక్ ఒకవేళ ఆడకపోతే ఆల్ రౌండర్ కోటాలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, రికల్టన్ లతో కూడిన ఓపెనింగ్ జోడీ మీద ముంబై భారీ ఆశలు పెట్టుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
