ODI World Cup 2027 : 2027 వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్ పూర్తిగా మార్పు.. ఈ సారి ఫైనల్ చేరాలంటే దేవుడు దిగి రావాల్సిందే
ODI World Cup 2027 : 2027 వన్డే వరల్డ్‌కప్ ఫార్మాట్‌ను ఐసీసీ పూర్తిగా మార్చేసింది. ఫైనల్ చేరాలంటే జట్లు మూడు కఠినమైన దశలను దాటాల్సి ఉంటుంది. సూపర్-7, కొత్త ఎలిమినేటర్ రూల్స్‌తో టోర్నీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. 2028 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఐసీసీ కీలక మార్పులను ప్రకటించింది.

ODI World Cup 2027 : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆరాధించే వన్డే ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ ఒక సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జరగబోయే 2027 వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్‌లో భారీ మార్పులు చేస్తున్నట్లు ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. ఎడిన్‌బరో వేదికగా జరిగిన ఐసీసీ వార్షిక సాధారణ సమావేశంలో ఈ సరికొత్త మార్పులకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోర్నమెంట్‌లో ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగేలా, జట్ల మధ్య పోటీని మరింత కఠినతరం చేసేలా ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చారు.
ఫైనల్ చేరాలంటే 3 రౌండ్ల అగ్నిపరీక్ష
రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్‌నకు ఆఫ్రికా ఖండం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీని దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నాయి. అయితే ఈసారి ఫైనల్ చేరడం మునుపటిలా అంత సులభం కాదు. కప్పు గెలవాలంటే జట్లు మూడు కఠినమైన రౌండ్లను దాటాల్సి ఉంటుంది.
రౌండ్-1 (సూపర్ సిరీస్): క్వాలిఫై అయిన 14 జట్లలో ర్యాంకింగ్స్ పరంగా అత్యంత కింద ఉన్న చివరి మూడు జట్లు మొదట సూపర్ సిరీస్ పేరుతో రౌండ్-రాబిన్ పద్ధతిలో తలపడతాయి. ఈ సిరీస్‌లో విజేతగా నిలిచిన ఒకే ఒక్క జట్టు మాత్రమే తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. మిగిలిన రెండు జట్లు అక్కడికక్కడే టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.
రౌండ్-2 (మెయిన్ స్టేజ్): ఈ రౌండ్‌లో మొత్తం 12 జట్లు ఉంటాయి. వీటిని ఆరేసి జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఇక్కడ గ్రూప్ దశలో రౌండ్-రాబిన్ పద్ధతిలో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, రెండు గ్రూపుల్లో కలిపి తర్వాతి బెస్ట్ రేటింగ్ ఉన్న మరో జట్టు.. మొత్తంగా 7 జట్లు తదుపరి దశకు చేరుకుంటాయి.
రౌండ్-3 (సూపర్-7 స్టేజ్): ఈ సరికొత్త స్టేజ్‌లో 7 జట్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో మొత్తం 21 మ్యాచ్‌లు ఆడుతాయి. ఇక్కడ పాయింట్ల పట్టికలో టాప్-4 లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు క్వాలిఫై అవుతాయి. సెమీస్ లో మొదటి స్థానంలో ఉన్న జట్టు నాలుగో జట్టుతో, రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో జట్టుతో తలపడతాయి.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో 2028 టీ20 వరల్డ్ కప్
వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028లో జరగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్ ఫార్మాట్‌ను కూడా ఐసీసీ మార్చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల సహ-మేజబానీలో జరగనున్న ఈ టోర్నీలో కూడా 20 జట్లు పాల్గొంటాయి. అయితే, టోర్నమెంట్ రెండో దశలో మరిన్ని ఎక్కువ మ్యాచ్‌లు జరిగేలా, ఉత్కంఠ పెరిగేలా ఐసీసీ ప్లాన్ చేసింది.
గ్రూప్ స్టేజ్: గత 2026 వరల్డ్ కప్‌లో 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించగా, ఈసారి ఐదు గ్రూపులుగా (ప్రతి గ్రూప్‌లో 4 జట్లు) విడదీశారు. ఈ దశలో 30 మ్యాచ్‌లు జరుగుతాయి. ఐదు గ్రూపుల నుంచి టాప్-2 లో నిలిచిన జట్లు (మొత్తం 10 జట్లు) సూపర్-10 స్టేజ్‌కు వెళ్తాయి.
సూపర్-10 రౌండ్: ఇక్కడ 10 జట్లను ఐదేసి చొప్పున రెండు గ్రూపులుగా విభజించి 20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. రెండు గ్రూపుల్లో టేబుల్ టాప్ లో నిలిచిన విజేత జట్లు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.
పొట్టి ప్రపంచకప్‌లోనూ ఐసీసీ మైండ్ బ్లాక్ ట్విస్ట్
సెమీఫైనల్‌లో మిగిలిన రెండు స్థానాల కోసం ఐసీసీ సరికొత్త ఎలిమినేటర్ రౌండ్‌ను ప్రవేశపెట్టింది. సూపర్-10లోని ఒక గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టు, మరో గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడాల్సి ఉంటుంది. ఈ రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు సెమీఫైనల్ లైన్-అప్‌ను పూర్తి చేస్తాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు పాత పద్ధతిలోనే సాగుతాయి. ఐసీసీ తీసుకొచ్చిన ఈ సరికొత్త వ్యూహాత్మక మార్పులు క్రికెట్ ప్రపంచంలో సరికొత్త మజాను అందించడం ఖాయం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
