ICC : క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. వన్డే, టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్లలో ఐసీసీ భారీ మార్పులు
ICC : వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లలో ఐసీసీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. సూపర్-7, సూపర్-10, ఎలిమినేటర్ రౌండ్ల తో టోర్నీలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి. చిన్న జట్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ కొత్త క్వాలిఫికేషన్ విధానాన్ని కూడా ఐసీసీ ప్రకటించింది.

ICC : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ఐసీసీ నడుం బిగించింది. పురుషుల వన్డే ప్రపంచకప్, అలాగే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ల నిర్వహణ తీరులో ఐసీసీ భారీ మార్పులను ప్రకటించింది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ కీలక నిర్ణయాలకు తుది రూపం ఇచ్చారు. క్రికెట్ మ్యాచ్‌లలో పోటీ తత్వాన్ని మరింత పెంచడానికి, వీక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి, చిన్న జట్లకు మరిన్ని అవకాశాలు కల్పించడానికే ఈ చారిత్రాత్మక మార్పులు చేస్తున్నట్లు ఐసీసీ గవర్నింగ్ బాడీ స్పష్టం చేసింది.
రాబోయే వన్డే ప్రపంచకప్‌లో మునుపటిలా 14 జట్లే పాల్గొన్నప్పటికీ, మ్యాచ్‌ల ఫార్మాట్ మాత్రం పూర్తిగా మారిపోనుంది. ఇకపై టోర్నమెంట్‌ను మూడు స్టేజ్‌లుగా నిర్వహించి ఫైనలిస్టులను తేల్చనున్నారు. మొదటి స్టేజ్ లో అత్యల్ప ర్యాంకులు కలిగిన చివరి మూడు జట్లు (12, 13, 14 స్థానాల్లోని జట్లు) సూపర్ సిరీస్ పేరుతో తలపడతాయి. ఇందులో కేవలం టాప్ నిలిచిన ఒక్క జట్టు మాత్రమే మెయిన్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. ఆ తర్వాత రెండో స్టేజ్ లో మొత్తం 12 జట్లు ఉంటాయి. వీటిని ఆరేసి జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, రెండు గ్రూపుల్లో కలిపి అత్యధిక ర్యాంక్ ఉన్న మరో జట్టు.. మొత్తంగా 7 జట్లు కలిసి సూపర్ 7 అనే సరికొత్త రౌండ్-రాబిన్ స్టేజ్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ సూపర్ 7 స్టేజ్ నుంచి టాప్-4 జట్లు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.
టీ20 ప్రపంచకప్‌లో చిన్న దేశాలు చూపిస్తున్న అద్భుత ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని ఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 20 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్ లో రెండో స్టేజ్‌ను ఎనిమిది జట్ల నుంచి పది జట్లకు పెంచింది. కొత్త ఫార్మాట్ ప్రకారం.. ప్రారంభ గ్రూప్ స్టేజ్ లో నాలుగు జట్ల చొప్పున ఐదు గ్రూపులు (మొత్తం 30 మ్యాచ్‌లు) ఉంటాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ 10 స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. ఈ సూపర్ 10లో ఐదేసి జట్ల చొప్పున రెండు గ్రూపులు ఉంటాయి. ఇక్కడే ఐసీసీ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ప్రతి గ్రూప్ నుంచి టేబుల్ టాప్‌లో ఉన్న ఒకే ఒక్క జట్టు నేరుగా సెమీస్ కి వెళ్తుంది. కాగా రెండు గ్రూపుల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన మిగతా నాలుగు జట్లు.. మిగిలిన రెండు సెమీఫైనల్ బెర్తుల కోసం ఎలిమినేటర్ మ్యాచ్‌లలో తలపడాల్సి ఉంటుంది. దీనివల్ల సూపర్ 10 లోని చివరి మ్యాచ్ వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది.
ఈ సమావేశంలో ఐసీసీ 2028 టీ20 ప్రపంచకప్ సైకిల్ క్వాలిఫికేషన్ కోసం ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రకటించింది. గత ఈవెంట్ లో బంగ్లాదేశ్ స్థానంలో చివరి నిమిషంలో వచ్చి అసాధారణ పరిస్థితుల మధ్య ఆడిన స్కాట్లాండ్ జట్టుకు ఐసీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. స్కాట్లాండ్‌కు యూరప్ రీజినల్ ఫైనల్స్‌లోకి నేరుగా ఎంట్రీ లభించింది. ఇక రాబోయే టోర్నీకి నేరుగా క్వాలిఫై కాలేని జట్లు గ్లోబల్ క్వాలిఫైయర్స్‌లో ఆడాల్సి ఉంటుంది. వీరితో పాటు రీజినల్ క్వాలిఫైయర్స్ నుంచి వచ్చే 8 జట్లు (ఆఫ్రికా, ఆసియా, యూరప్ నుంచి రెండేసి.. అమెరికా, ఈస్ట్ ఆసియా-పసిఫిక్ నుంచి ఒక్కో జట్టు) ఇందులో పాల్గొంటాయి. ఈ గ్లోబల్ క్వాలిఫైయర్స్‌లో ప్రతి రీజియన్ లో టాప్ లో నిలిచిన జట్టుతో పాటు, ఓవరాల్ గా తర్వాతి మూడు అత్యుత్తమ జట్లు 2028 టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధిస్తాయి.
డెవలప్‌మెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీలు ప్రతిపాదించిన ఈ సరికొత్త వరల్డ్ కప్ రోడ్‌మ్యాప్‌కు ఐసీసీ బోర్డు ప్రాథమిక ఆమోదం తెలిపింది. అయితే ఇంత పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నందున దీనికి సంబంధించిన ఆర్థిక, వాణిజ్యపరమైన లావాదేవీల లెక్కింపులు జరగాల్సి ఉంది. అందువల్ల ఐసీసీకి చెందిన ఫైనాన్షియల్ కమిటీ ఈ ప్రతిపాదనలను పూర్తిగా సమీక్షించిన తర్వాత, ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే బోర్డు సమావేశంలో ఈ సరికొత్త వరల్డ్ కప్ ఫార్మాట్లపై తుది ముద్ర వేయనున్నారు. ఏదేమైనా ఈ కొత్త మార్పులు క్రికెట్ ప్రపంచంలో సరికొత్త జోష్ నింపడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
