AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : టీమిండియాలో భారీ మార్పులు?.. రోహిత్, కోహ్లీపై శుభ్‌మన్ గిల్ సంచలన ప్రకటన

IND vs ENG : ఇంగ్లాండ్‌పై తొలి వన్డే విజయం తర్వాత శుభ్‌మన్ గిల్ 2027 ప్రపంచకప్ లక్ష్యంగా టీమిండియాలో విభిన్న కాంబినేషన్లను పరీక్షిస్తున్నట్లు వెల్లడించాడు. రోహిత్, కోహ్లీ విఫలమైనా జట్టు గెలవగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, బీసీసీఐ రొటేషన్ పాలసీపై కీలక సంకేతాలు ఇచ్చాడు.

IND vs ENG : టీమిండియాలో భారీ మార్పులు?.. రోహిత్, కోహ్లీపై శుభ్‌మన్ గిల్ సంచలన ప్రకటన
RO - KO
Rakesh
|

Updated on: Jul 15, 2026 | 4:54 PM

Share

IND vs ENG : భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన తర్వాత టీమిండియా తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయానికి ముందు భారత్ టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ చేతిలో 0-4తో అంతకుముందు ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్‌లను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి రావడంతో టీమిండియా బలంగా మారడమే కాకుండా మైదానంలో వారి అనుభవం స్పష్టంగా కనిపించింది.

2027 వన్డే వరల్డ్ కప్పే మా టార్గెట్

ఇంగ్లాండ్‌పై సాధించిన ఈ అద్భుత విజయం తర్వాత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడాడు. ఈ సందర్భంగా జట్టు భవిష్యత్తు ప్రణాళికలను అతడు వెల్లడించాడు. తాము ప్రస్తుతం సాధిస్తున్న విజయాలతో పాటు లాంగ్ టర్మ్ గోల్స్ పై దృష్టి పెట్టామని చెప్పాడు. ముఖ్యంగా 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌ను మనస్సులో ఉంచుకుని జట్టులో విభిన్న రకాల కాంబినేషన్లను ప్రయోగిస్తున్నట్లు స్పష్టం చేశాడు. వేర్వేరు కాంబినేషన్లను పరీక్షించడం ద్వారా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో జట్టు ఎంతవరకు లోతుగా రాణించగలదో స్పష్టత వస్తుందని గిల్ అభిప్రాయపడ్డాడు.

రోహిత్, కోహ్లీలు ఫెయిల్ అయినా భయం లేదు

ఈ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ లోయర్ ఆర్డర్ అదరగొట్టడంపై గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ 11 పరుగులకే అవుట్ కాగా, విరాట్ కోహ్లీ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఒక చక్కని ఫోర్ కొట్టి, ఆ తర్వాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు. దీనిపై గిల్ మాట్లాడుతూ.. “టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యత తీసుకుని పరుగులు చేస్తూ మ్యాచ్‌లను గెలిపించడం ఒక కెప్టెన్‌గా నాకు, జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది” అని అన్నాడు. తమ బ్యాటింగ్ లైనప్‌పై పూర్తి నమ్మకం ఉందని, అందుకే టాస్ గెలిస్తే లక్ష్యం 320 పరుగులు అయినా సరే మొదట బౌలింగ్ చేయాలనే అనుకున్నామని గిల్ తెలిపాడు.

సౌతాఫ్రికా పిచ్‌లను తలపిస్తున్న ఇంగ్లాండ్ వాతావరణం

వచ్చే వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికాలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పరిస్థితులు ఆ టోర్నమెంట్‌కు సిద్ధమవడానికి బాగా ఉపయోగపడతాయని గిల్ పేర్కొన్నాడు. “నా అభిప్రాయం ప్రకారం ఇక్కడి పిచ్‌లు, వాతావరణం చాలా వరకు సౌతాఫ్రికా పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయి. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు, ఎందుకంటే బంతి బాగా మూవ్‌మెంట్ అవుతోంది. కానీ సమయం గడిచేకొద్దీ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. ఇలాంటి కఠినమైన పిచ్‌లపై మేము రకరకాల ప్రయోగాలు చేయడం వల్ల మాకు చాలా మంచి జరుగుతుంది” అని వివరించాడు.

భారత ఆటగాళ్ల కోసం బీసీసీఐ సరికొత్త పాలసీ

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2027 ప్రపంచకప్‌కు ముందు వీలైనంత ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించడానికి బీసీసీఐ ఒక ప్రత్యేక రొటేషన్ పాలసీని అమలు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తూ, కొత్త వారికి అవకాశాలు ఇస్తూ ప్రయోగాలు చేయనున్నారు. భవిష్యత్తులో వచ్చే పెద్ద టోర్నమెంట్ల కోసం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా అత్యుత్తమమైన బెంచ్ బలాన్ని సిద్ధం చేయడమే ఈ రొటేషన్ పాలసీ ముఖ్య ఉద్దేశం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us