AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Tendulkar : లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది.. సచిన్ కొడుక్కి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ?

Arjun Tendulkar : ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టులో చోటు దక్కని అర్జున్ టెండూల్కర్‌కు బీసీసీఐ ఊరటనిచ్చింది. ముంబై టీ20 లీగ్ ఆడేందుకు అనుమతి లభించింది. ఈ తరుణంలో టీ20 ముంబై లీగ్ నాల్గవ సీజన్ అర్జున్ కెరీర్‌కు కీలకం కానుంది.

Arjun Tendulkar : లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది.. సచిన్ కొడుక్కి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ?
Arjun
Rakesh
|

Updated on: May 01, 2026 | 5:55 PM

Share

Arjun Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టులో ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు తుది జట్టులో చోటు దక్కక బెంచ్‌కే పరిమితమైన అర్జున్, ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో లీగ్‌లోకి అడుగుపెడుతున్నారు. ముంబై టీ20 లీగ్ ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అర్జున్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఐపీఎల్ 2026 సీజన్ ట్రేడింగ్ విండోలో భాగంగా ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి అర్జున్ టెండూల్కర్ మారారు. అయితే లక్నో మేనేజ్‌మెంట్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అర్జున్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. నెట్ ప్రాక్టీస్‌కే పరిమితమవుతున్న అర్జున్, తన టాలెంట్ నిరూపించుకునేందుకు సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ తరుణంలో టీ20 ముంబై లీగ్ నాల్గవ సీజన్ అర్జున్ కెరీర్‌కు కీలకం కానుంది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఏ ఆటగాడైనా 12 నెలల కాలంలో కేవలం ఒకే ఒక గుర్తింపు పొందిన రాష్ట్ర లీగ్‌లో పాల్గొనాలి (ఐపీఎల్ మినహా). అర్జున్ టెండూల్కర్ గతేడాది కాలంలో ఇతర రాష్ట్రాల టీ20 లీగ్‌లలో ఆడలేదు కాబట్టి, ముంబై లీగ్‌లో ఆడేందుకు అతనికి అర్హత లభించింది. వాస్తవానికి అర్జున్ ప్రస్తుతం గోవా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పటికీ, గతంలో ముంబై జట్టుకే ప్రాతినిధ్యం వహించినందున ఈ లీగ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు.

ముంబై టీ20 లీగ్‌కు సంబంధించిన వేలం ప్రక్రియ మే 2వ తేదీన జరగనుంది. పురుషుల, మహిళల విభాగాలకు వేర్వేరుగా నిర్వహించే ఈ వేలంలో అర్జున్ టెండూల్కర్ పేరును చేర్చాలని బీసీసీఐ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ నెల మొదటి 15 రోజుల్లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ లీగ్ ప్రారంభం కానుండటం అర్జున్ వంటి యంగ్ ప్లేయర్లకు మంచి ప్రాక్టీస్, అవకాశంగా మారుతుంది.

అర్జున్ టెండూల్కర్ ఇటీవల రంజీ ట్రోఫీలో గోవా తరఫున ఆడుతూ నిలకడగా రాణిస్తున్నారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గానే కాకుండా, అవసరమైనప్పుడు బ్యాట్ తో కూడా మెరుపులు మెరిపించగల కెపాసిటీ అతనికి ఉంది. ఐపీఎల్ లో లక్నో టీమ్ అవకాశం ఇవ్వకపోవడంతో, ముంబై లీగ్ ద్వారా తన సత్తా ఏంటో నిరూపించి, వచ్చే సీజన్ కల్లా టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టిని ఆకర్షించాలని అర్జున్ భావిస్తున్నారు. సచిన్ వారసుడిగా తన మీద ఉన్న ఒత్తిడిని అధిగమించి ఈ లీగ్‌లో ఎలా రాణిస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us