AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krunal Pandya : తమ్ముడితో కలిసి మళ్ళీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి.. కృనాల్ పాండ్యా మనసులో మాట

Krunal Pandya : ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన కృనాల్ పాండ్యా, తన భవిష్యత్తు లక్ష్యాలను పంచుకున్నాడు. 2027 వరల్డ్ కప్‌లో తమ్ముడు హార్దిక్‌తో కలిసి ఆడటమే తన లక్ష్యమని వెల్లడించాడు. కృనాల్ పాండ్యా భారత జట్టుకు చివరిసారిగా 2021లో ప్రాతినిధ్యం వహించాడు.

Krunal Pandya : తమ్ముడితో కలిసి మళ్ళీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి.. కృనాల్ పాండ్యా మనసులో మాట
Krunal Pandya
Rakesh
|

Updated on: May 11, 2026 | 12:59 PM

Share

Krunal Pandya : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించిన ఉత్కంఠభరిత విజయంలో కృనాల్ పాండ్యా హీరోగా నిలిచాడు. ఒకప్పుడు ముంబై ఇండియన్స్‌కు వెన్నెముకగా ఉన్న కృనాల్, ఇప్పుడు అదే జట్టు ప్లేఆఫ్ ఆశలను దెబ్బతీసి ఆర్సీబీని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేర్చాడు. ఈ మ్యాచ్ అనంతరం కృనాల్ తన చిన్ననాటి కల గురించి, భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ, 39 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా, జాకబ్ బెథెల్‌తో కలిసి 55 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ, పట్టువదలకుండా పోరాడి జట్టును విజయానికి చేరువ చేశాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్ మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది.

2027 వరల్డ్ కప్‌పై కన్నేసిన పాండ్యా బ్రదర్

మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కృనాల్, తన తమ్ముడు హార్దిక్ పాండ్యాతో కలిసి మళ్ళీ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవాలని ఉందని వెల్లడించాడు. “నేను 6 ఏళ్ల వయసు నుంచే దేశం కోసం ఆడాలని కలలు కన్నాను. 2027 వన్డే ప్రపంచ కప్‌లో తమ్ముడు హార్దిక్ ఉన్న భారత జట్టులో నేనూ భాగం కావాలని కోరుకుంటున్నాను. ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను” అని కృనాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

డొమెస్టిక్ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన

కృనాల్ పాండ్యా భారత జట్టుకు చివరిసారిగా 2021లో ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుండి టీమిండియాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్‌లో బరోడా తరపున కృనాల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు చేయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి తన సత్తా చాటాడు.

ఆర్సీబీకి వెన్నెముకగా ఆల్ రౌండర్

గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కృనాల్, ఆర్సీబీలో మాత్రం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 141 స్ట్రైక్ రేట్‌తో 141 పరుగులు చేయడమే కాకుండా, 10 వికెట్లు తీసి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌ను మే 13న రాయ్‌పూర్‌లో కేకేఆర్‌తో ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us