AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s World Cup 2025 : వర్షంతో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు.. పాకిస్తాన్‌కు భారీ షాక్

డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ వల్ల టోర్నమెంట్ సెమీఫైనల్ లైన్-అప్‌పై ఎటువంటి ప్రభావం పడలేదు. టీమ్ ఇండియాకు ఇది కేవలం ఒక లాంఛనం, బెంచ్‌పై ఉన్న కొందరు ఆటగాళ్లను పరీక్షించుకునే అవకాశం. బంగ్లాదేశ్‌కు అయితే కొంత గౌరవాన్ని నిలుపుకునే అవకాశం ఉండేది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

Women's World Cup 2025 : వర్షంతో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు.. పాకిస్తాన్‌కు భారీ షాక్
Women's World Cup 2025
Rakesh
|

Updated on: Oct 27, 2025 | 7:33 AM

Share

Women’s World Cup 2025 : ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఫలితం లేని మ్యాచ్‌గా ముగిసింది. దీంతో వర్షం కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఈ ప్రపంచకప్ లీగ్ దశ ముగిసింది. నవీ ముంబైలో ఆదివారం అక్టోబర్ 26న జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 27 ఓవర్లలో 119 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమ్ ఇండియా గెలుపు దిశగా దూసుకుపోతున్నట్లు కనిపించింది కానీ, 9వ ఓవర్‌లోనే మళ్లీ వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు.

డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ వల్ల టోర్నమెంట్ సెమీఫైనల్ లైన్-అప్‌పై ఎటువంటి ప్రభావం పడలేదు. టీమ్ ఇండియాకు ఇది కేవలం ఒక లాంఛనం, బెంచ్‌పై ఉన్న కొందరు ఆటగాళ్లను పరీక్షించుకునే అవకాశం. బంగ్లాదేశ్‌కు అయితే కొంత గౌరవాన్ని నిలుపుకునే అవకాశం ఉండేది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మళ్లీ వర్షం అడ్డుకోవడంతో దీనిని 27 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. కేవలం 53 పరుగులకే 3 వికెట్లు పడిపోయాయి. అయితే, షర్మిన్ అఖ్తర్ (36 పరుగులు), శోభనా మోస్తరీ (26 పరుగులు) మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. శోభనా చాలా వేగంగా బ్యాటింగ్ చేసింది. కానీ 22వ ఓవర్‌లో 91 పరుగుల వద్ద శోభనా ఔటవ్వడంతో వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత ప్రతి ఓవర్‌లో బంగ్లాదేశ్ వికెట్లను కోల్పోయింది. చివరికి 27 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 119 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో అవకాశం పొందిన స్పిన్నర్ రాధా యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు తీసింది.

టీమ్ ఇండియా బ్యాటింగ్‌కు దిగినప్పుడు, డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ పద్ధతి కారణంగా కొత్త లక్ష్యం 126 పరుగులుగా నిర్ణయించబడింది. అయితే, భారత జట్టుకు ఈ సమయంలో ప్రతీక రావెల్ రూపంలో ఒక చెడు వార్త వచ్చింది. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆమె కాలి చీలమండ మరియు మోకాలికి గాయమైంది. దీంతో టీమ్ ఇండియా ప్రయోగం కోసం అమన్‌జోత్ కౌర్ (15 పరుగులు)ను ఓపెనింగ్‌కు పంపింది. స్మృతి మంధానా (34 పరుగులు), అమన్‌జోత్ 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు జోడించారు. ఆ సమయంలో వర్షం మళ్లీ రావడంతో మ్యాచ్ ఆగింది, ఆ తర్వాత మళ్లీ ప్రారంభం కాలేదు. అంపైర్లు మ్యాచ్‌ను అక్కడే ముగించాలని నిర్ణయించారు.

ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల బంగ్లాదేశ్‌కు అత్యధిక లాభం, పాకిస్తాన్‌కు నష్టం జరిగింది. మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో భారత్ మరియు బంగ్లాదేశ్‌కు 1-1 పాయింట్ లభించింది. టీమిండియా పై దీని ప్రభావం పెద్దగా పడలేదు, ఎందుకంటే 7 పాయింట్లతో నాలుగో స్థానంలోనే ఉండి సెమీఫైనల్‌లో నిలబడింది. మరోవైపు, ఇప్పటివరకు 8వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఏకంగా 7వ స్థానానికి ఎగబాకింది. బంగ్లాదేశ్‌కు మొత్తం 3 పాయింట్లు అయ్యాయి. దీంతో అది పాకిస్తాన్‌తో సమానంగా నిలిచింది. అయితే, బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ గెలిచింది, కానీ పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. అందుకే పాకిస్తాన్ టోర్నమెంట్‌లో అత్యంత అట్టడుగు (8వ అంటే చివరి) స్థానంలో నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..