IND vs NZ: సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలుకొట్టిన కోహ్లి
2023 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. రికార్డులు తిరగరాస్తూ అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్నాడు. కానీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. అదెంటో తెలుసుకుందాం పదండి....

భారత స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లోకి వచ్చినప్పుడల్లా, ఏదో ఒక రికార్డు ఖచ్చితంగా బద్దలు అవుతుంది. ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కూడా అదే సీన్ రిపీటయ్యింది.న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవెన్‌లో విరాట్ కోహ్లీ పేరు చేరిన వెంటనే సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు కోహ్లీ. తన రెండు దశాబ్దాల వన్డే కెరీర్‌లో సచిన్ సాధించనిది విరాట్ కోహ్లీ వాంఖడేలో సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లో నాలుగు సెమీఫైనల్‌లు ఆడిన తొలి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2011లో ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ తన తొలి సెమీఫైనల్ ఆడాడు. ఈ ప్రపంచకప్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. దీని తర్వాత 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో విరాట్ సెమీఫైనల్ ఆడాడు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి సెమీఫైనల్ ఆడగా.. ఇప్పుడు 2023లో మరోసారి ప్రపంచకప్ సెమీఫైనల్ ఆడిన ఘనత విరాట్ కోహ్లికి దక్కింది.
మూడు ప్రపంచకప్‌లు ఆడిన సచిన్
సచిన్ టెండూల్కర్ తన 24 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో 6 ప్రపంచ కప్‌లు ఆడాడు. అయితే వరల్డ్ కప్స్‌లో సెమీ-ఫైనల్‌ను మూడు సార్లు మాత్రమే ఆడగలిగాడు. సచిన్ 1996, 2003, 2011 ప్రపంచకప్‌లలో సెమీఫైనల్స్ టీమ్‌లో ఉన్నాడు. ఇప్పుడు సచిన్‌ను విరాట్ కోహ్లీ అధిగమించాడు.
సచిన్ పేరిట మరో ప్రపంచ రికార్డుకు ఇప్పుడు విరాట్ చేరువలో ఉన్నాడు . 2003 ప్రపంచకప్‌లో సచిన్ 673 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 99 సగటుతో 594 పరుగులు చేశాడు. అంటే సచిన్‌ను అధిగమించే అవకాశం విరాట్ కోహ్లీకి ఉంది.
49 వన్డే సెంచరీల సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు విరాట్ ఈ ప్రపంచకప్‌లో మరో సెంచరీ చేస్తే సచిన్‌ను అధిగమించగలడు. న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..