కళ్లముందే మాయమయ్యే శివాలయం.. సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యం.. ఎక్కడుందంటే..?
కళ్ల ముందే అదృశ్యమై, మళ్లీ ప్రత్యక్షమయ్యే అద్భుత శివాలయం గురించి మీకు తెలుసా..? గాయబ్ మందిర్‌గా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి. భక్తులు దీనిని శివుడికి సముద్రుడు చేసే జలాభిషేకంగా నమ్ముతారు. కార్తికేయుడి పురాణ గాథతో ముడిపడిన ఈ అద్భుత క్షేత్రాన్ని దర్శించే ముందు ఆటుపోట్ల సమయాలను తెలుసుకోవడం ముఖ్యం.

భారతదేశం ఆధ్యాత్మికతకు, అంతుచిక్కని రహస్యాలకు నిలయం. ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలు తమదైన ప్రత్యేకతతో భక్తులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి వాటిలో గుజరాత్‌లోని భరూచ్ జిల్లా కవి కాంబోయ్ గ్రామంలో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం అత్యంత విలక్షణమైనది. ఈ ఆలయాన్ని స్థానికులు గయాబ్ మందిర్ (మాయమయ్యే ఆలయం) అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయం రోజుకు రెండుసార్లు భక్తుల కళ్ళ ముందే సముద్రంలో కలిసిపోయి, మళ్ళీ ప్రత్యక్షమవుతుంది.
ప్రకృతి ఒడిలో అద్భుతం
అరేబియా సముద్రం కాంబే సింధుశాఖ తీరంలో ఈ ఆలయం కొలువై ఉంది. ఇక్కడ సముద్రంలో వచ్చే ఆటుపోట్ల కారణంగా ఈ వింత చోటుచేసుకుంటుంది. సముద్రంలో పోటు వచ్చినప్పుడు నీటి మట్టం పెరిగి ఆలయం మొత్తం సముద్ర గర్భంలో మునిగిపోతుంది. ఆ సమయంలో కేవలం ఆలయ శిఖరం మాత్రమే కనిపిస్తుంది. ఆటు తగ్గినప్పుడు నీరు వెనక్కి వెళ్లిపోవడంతో శివలింగం, పూర్తి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది.
శివలింగానికి సముద్రుడి జలాభిషేకం
ఈ అద్భుతాన్ని భక్తులు కేవలం ఒక భౌతిక మార్పుగా మాత్రమే చూడరు. సముద్రపు అలలు శివలింగాన్ని తాకుతూ ముంచెత్తడాన్ని సముద్రుడు శివుడికి స్వయంగా చేసే జలాభిషేకంగా భక్తులు నమ్ముతారు. అలలు తక్కువగా ఉన్న సమయంలో మాత్రమే భక్తులు గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేయడానికి అనుమతిస్తారు.
పురాణ గాథ.. కార్తికేయుడి పశ్చాత్తాపం
ఈ ఆలయానికి 150 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ, దీని వెనుక ఉన్న పురాణ గాథ వేల ఏళ్ల నాటిది. పురాణాల ప్రకారం..శివుని కుమారుడైన కార్తికేయుడు, రాక్షసుడైన తారకాసురుడిని వధించిన తర్వాత తన తండ్రి భక్తుడైన రాక్షసుడిని చంపినందుకు చింతించాడు. తన పాప పరిహారం కోసం విష్ణుమూర్తి సూచన మేరకు తారకాసురుడిని చంపిన చోటే ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడు. అదే నేటి స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం.
పర్యాటకులు గమనించాల్సిన విషయం
ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునే వారు ముందుగా ఆటుపోట్ల సమయాలను తెలుసుకోవడం తప్పనిసరి. సాధారణంగా శివరాత్రి, అమావాస్య రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సముద్రం వెనక్కి వెళ్లే వరకు వేచి చూసి ఆ తర్వాతే శివయ్యను దర్శించుకోవడం ఇక్కడ ఒక మధురమైన అనుభూతి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




