భారతీయులు ఏడాదికి ఎన్ని కిలోల ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారో తెలుసా.. రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు..
ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఉన్నా, టన్నుల కొద్దీ ఆహారం వృధా అవుతోంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచ సగటున ఒక వ్యక్తి ఏటా 79 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. ఈ వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయి. రీసైక్లింగ్, అవగాహనతో వృధాను అరికట్టడం, స్థిరమైన భవిష్యత్తుకు కీలకం. మరి భారతీయులు ఏడాదికి ఎన్ని కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నారు అనేది తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఒకవైపు వేధిస్తుంటే, మరోవైపు టన్నుల కొద్దీ ఆహారం చెత్తబుట్టల పాలవుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం విడుదల చేసిన ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ నివేదికలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి సగటున ఏడాదికి 79 కిలోల ఆహారాన్ని వృధా చేస్తుండగా భారతీయులు కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదని నివేదిక స్పష్టం చేసింది.
భారత్‌లో పరిస్థితి ఏమిటి?
భారతదేశంలో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 55 కిలోల ఆహార వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాడు. ఇందులో మనం వండుకున్నాక మిగిలిపోయిన ఆహారం, కూరగాయల తొక్కలు, పాడైపోయిన పండ్లు వంటివి ఉన్నాయి. మన దేశ జనాభా దృష్ట్యా చూస్తే, ఇది పర్యావరణంపై ఎంతటి భారాన్ని మోపుతుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచ దేశాల జాబితా: ఎవరు టాప్? ఎవరు లాస్ట్?
ఆహార వ్యర్థాల ఉత్పత్తిలో ఒక్కో దేశం ఒక్కో తీరుగా ఉంది.
అత్యధిక వ్యర్థాలు: మాల్దీవులు అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఒక్కో వ్యక్తి ఏడాదికి ఏకంగా 207 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఈజిప్ట్ (163 కిలోలు), ఇరాక్ (143 కిలోలు), పాకిస్తాన్ (130 కిలోలు) ఉన్నాయి.
అత్యల్ప వ్యర్థాలు: ఈ జాబితాలో రష్యా ఆదర్శంగా నిలుస్తోంది. రష్యాలో ఒక వ్యక్తి ఏడాదికి కేవలం 33 కిలోల వ్యర్థాలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఆహారమే కాదు.. ఇతర వ్యర్థాలూ ఎక్కువే!
కేవలం ఆహారమే కాదు ఇతర వ్యర్థాలను కూడా కలిపితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. భారత్‌లో ఒక వ్యక్తి రోజుకు సగటున 0.35 నుండి 0.6 కిలోల చెత్తను ఉత్పత్తి చేస్తున్నాడు. అంటే ఏడాదికి ఒక వ్యక్తి ద్వారా 125 కిలోల నుండి 200 కిలోల వరకు మొత్తం వ్యర్థాలు తయారవుతున్నాయి. దీనికి అదనంగా మారుతున్న టెక్నాలజీ వల్ల పాత సెల్ ఫోన్లు, వైర్లు వంటి ఈ-వ్యర్థాలు కూడా పెరిగిపోతున్నాయి. ఒక భారతీయుడు ఏడాదికి సగటున 2 కిలోల ఈ-వ్యర్థాలను సృష్టిస్తున్నాడు.
పరిష్కారం ఏమిటి?
పెరిగిపోతున్న ఈ వ్యర్థాలు పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రీసైక్లింగ్: ఆహార వ్యర్థాల నుండి సేంద్రియ ఎరువులు తయారు చేయడం, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
అవగాహన: అవసరమైన మేరకే ఆహారాన్ని వండుకోవడం, వృధాను అరికట్టడం వంటి చిన్న మార్పులు మానవాళికి ఎంతో మేలు చేస్తాయి.
మనం పారేసే ప్రతి మెతుకు వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆకలి లేని ప్రపంచం కావాలంటే వృధా లేని సమాజం దిశగా మనం అడుగులు వేయాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
