AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తజన సంద్రంగా జగిత్యాల పెద్దపూర్.. 50వేల బోనాలతో మల్లన్న జాతర

జగిత్యాల జిల్లా పెద్దపూర్ లో కాముడి పౌర్ణమి అనంతరం జరిగిన మల్లికార్జున స్వామి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ, పక్క రాష్ట్రాల నుండి వేలాది భక్తులు తరలివచ్చి బోనాలతో స్వామివారిని దర్శించుకున్నారు. 29 ఏళ్లుగా ఆదివారం నియమాలు పాటించే గ్రామస్థులు, భక్తులు పట్నాలు వేసి, బెల్లం తులాభారం, గొర్రెపిల్లల సమర్పణ వంటి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం, పోతురాజుల విన్యాసాలు జాతరకు మరింత శోభనిచ్చాయి.

భక్తజన సంద్రంగా జగిత్యాల పెద్దపూర్.. 50వేల బోనాలతో మల్లన్న జాతర
Peddapur Bonalu Festival
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 09, 2026 | 7:12 PM

Share

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. కాముడి పౌర్ణమి మొదటి ఆదివారం నిర్వహించే బోనాల జాతరలో వేలాది మంది భక్తులు బోనాలతో పెద్దపూర్ వచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే మల్లికార్జున స్వామిని స్థానికులతో పాటు చుట్టూ పక్కల జిల్లాలు, పక్క రాష్ట్రాల భక్తులు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. మల్లన్నకు ఇష్టమైన ఆదివారం రోజున గత 29 ఏండ్లుగా గ్రామస్థులు ప్రతి ఆదివారం మాంసాహారం, మద్యం ముట్టుకోకుండా నియమ నిష్టలతో ఉంటారు.

ఆదివారం మల్లన్న ఆలయంలో ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ గడ్ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. పట్నాలు వేసి, మల్లికార్జునుడికి ఇష్టమైన బోనాలను భక్తులు నైవేద్యంగా సమర్పించి, మొక్కులు చెల్లించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉపవాస దీక్షలతో భక్తులు స్వామి వారిని దర్శించుకొని, పట్నాలు వేసి, నిలువెత్తు బంగారం (బెల్లం) తులాభారం, వందల సంఖ్యలో గొర్రె పిల్లలను మల్లన్నకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

అలాగే ఇష్టమైన గూడాన్నం, పరమాన్నం బోనాలు తీసి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శివసత్తుల ఆటలు, ఒగ్గు కళాకారుల డప్పు మోతలతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. నైవేద్యం వండి స్వామి వారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. సాయంత్రం ఒకేసారి సుమారు 50 వేలకు పైగా బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామి వారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల శోభాయాత్ర అనంతరం రథోత్సవం జరిపారు. రథోత్సవం ముందు పోతురాజుల విన్యాసాలు అందర్నీ ఆకర్షించాయి. ఇంతమంది మహిళలు ఒక్కసారి..బోనం ఎత్తుకోవడం ఇక్కడ మాత్రమే కనబడుతుంది. 50 వేయిల మంది బోనాలు ఎత్తుకొని వెళ్తున్న దృశ్యం ఆకట్టుకుంది..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us