సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది: నాగార్జున
‘పళ్ళ బురుసు’ సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. అదే సమయంలో కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది. ఇంత మంచి సినిమా చేసినందుకు చాలా తృప్తిగా ఉందని ప్రెస్ మీట్‌లో కింగ్ నాగార్జున అన్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ: అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఇది 50వ సంవత్సరం. నాన్నగారు ప్రారంభించిన ఈ సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించాం. జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలను కూడా రూపొందించాం. ఈ 50వ సంవత్సరం సందర్భంగా మా టీమ్ అంతా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో భాగంగా డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించాం. నాన్నగారు సినిమాలు చేసిన రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండేదో, ఆ పద్ధతిని మళ్లీ తీసుకురావడంతో పాటు దాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించాం. అది చాలా విజయవంతంగా సాగుతోందని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్నో మంచి సినిమాలు చేశాం. ఇకపై మరింత వేగంగా, మరింత బలంగా సినిమాలు చేయాలని, మరింతమంది కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ సినిమాలను ప్రారంభించాం అన్నారు నాగార్జున.
మొన్ననే ‘లెనిన్’ను రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘పళ్ళ బురుసు’ను విడుదల చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు నా ‘కింగ్ 100’ కూడా రాబోతోంది. ఇకపై అన్నపూర్ణ స్టూడియోస్ చాలా బిజీగా ఉంటుంది. ఇకపై మరింత జోరుగా సినిమాలు చేయబోతున్నాం.. ‘పళ్ళ బురుసు’ సినిమా గురించి చెప్పాలంటే.. తల్లిదండ్రులను చూసుకోవడం కంటే అదృష్టం మరొకటి ఉండదు. నా తల్లిదండ్రులను నేను చూసుకున్నాను. వాళ్లు నన్ను చిన్నప్పుడు చూసుకున్నారు. మనకు చిన్నప్పుడు ఏ భయం వచ్చినా తల్లిదండ్రుల చేయి పట్టుకుంటాం. మనం పెద్దయ్యాక వాళ్ల బాధ్యతను తీసుకోవాలి. ఎవరైనా సరే తల్లిదండ్రులకు సేవ చేయాలి. అమల తన పేరెంట్స్ ని అద్భుతంగా చూసుకుంటుంది. తనతో ఎప్పుడూ చెబుతుంటాను.. తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరని. తల్లిదండ్రులను చూసుకోవడం చాలా ముఖ్యం అన్నారు నాగ్.
ఉదయ్ నాకు కథ చెప్పినప్పుడు ఇదే విషయం నాకు గుర్తుకు వచ్చింది. ఈ కథను అతను చాలా ఎంటర్టైనింగ్‌గా చెప్పాడు. సుధాకర్ రెడ్డి గారు, శంభూతాత పాత్రలో అద్భుతంగా చేశారు. మురళీధర్ గౌడ్ గారి నటన కూడా చాలా బాగుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ చక్కని నటన కనబరిచారు. చాలా మంచి టీమ్‌వర్క్‌తో చేసిన సినిమా ఇది. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. పవన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ‘లవ్ స్టోరీ’ మ్యూజిక్‌ను నేను ఇప్పటికీ వింటూ ఉంటాను. ఈ సినిమాకు కూడా ఆయన చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నేను సినిమా చూశాను. చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది. సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నాను. అదే సమయంలో కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది. ఈ సినిమా చేసినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అందరూ ప్రేమించి తీసిన సినిమా ఇది. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కొత్త కథతో ఎవరైనా వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడానికి సిద్ధంగా ఉంది. మా టీమ్‌కు కథ నచ్చితే, నేను తప్పకుండా కథ వింటాను. అన్నపూర్ణ కాలేజీకి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు తెలంగాణ కల్చర్‌పై ఎందుకు ఒక సినిమా తీయకూడదని అడిగారు. పళ్ళ బురుసు నేపధ్యానికి సంబంధించిన చక్కని కథ. ఆగస్టు 14 మా అమ్మగారి పుట్టినరోజు. అమ్మానాన్నల ఆశీస్సులు ఈ సినిమాపై ఉంటాయని నాకు నమ్మకం ఉంది అని నాగార్జున అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
