Valmiki Temple: పాక్ లో తెరుచుకున్న 1200 ఏళ్లనాటి వాల్మీకి ఆలయం.. ఘనంగా పూజలను నిర్వహించిన భక్తులు
ఇరవై ఏళ్ల క్రితం క్రైస్తవ కుటుంబం వాల్మీకి ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. ఆలయ భూమి రెవెన్యూ రికార్డుల్లో ఈటీపీబీకి బదలాయించినా.. ఆ ఆస్తికి తామే వారసులం అంటూ క్రైస్తవ కుటుంబం 2010-2011లో కోర్టులో కేసు వేసింది
Valmiki Temple: ఎట్టకేలకు పాకిస్థాన్‌లోని చారిత్రాత్మక వాల్మీకి ఆలయానికి విముక్తి కలిగింది. లాహోర్‌లో రెండు దశాబ్దాల పాటు ఓ క్రైస్తవ కుటుంబం కబ్జాలో ఉన్న 1,200 ఏళ్ల నాటి వాల్మీకి ఆలయం మళ్లీ ప్రజల దర్శనార్థం తెరచుకుంది. పాక్‌లో మైనారిటీ వర్గాల ప్రార్థనా స్థలాల వ్యవహారాలను పర్యవేక్షించే ‘ది ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. హిందూమతంలోకి మారినట్లు చెప్పుకుంటున్న ఆ క్రైస్తవ కుటుంబం వాల్మీకి ఆలయానికి చెందిన భూములు తమకే చెందుతాయని కోర్టులో కేసు వేసింది. అంతేకాదు, ఆ గుడిలోకి హిందువులను దర్శనానికి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీనిపై సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన ఈటీపీబీ విజయం సాధించింది. జూలై నెలలో ఈ ఆలయాన్ని ఈటీపీబీకి అప్పగిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పు నిచ్చింది. లాహోర్‌లోని ప్రసిద్ధ అనార్కలీ బజార్ సమీపంలో ఉన్న ఈ ఆలయం మళ్లీ తెరచుకుంది. ఈ సందర్భంగా వందకు పైగా హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, ముస్లిం నేతలు ప్రారంభోత్సవంలో పాల్గొని దర్శనం చేసుకున్నారు.
ఈటీపీబీ అధికార ప్రతినిధి అమీర్ హష్మీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో వాల్మీకి ఆలయాన్ని ‘మాస్టర్ ప్లాన్’ కింద పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. వాల్మీకి ఆలయంలో 100 మందికి పైగా హిందువులు, కొంతమంది సిక్కులు, క్రైస్తవ నాయకులు సమావేశమయ్యారు. హిందువులు తమ మతపరమైన ఆచారాలను నిర్వహించి, మొదటిసారిగా ప్రసాదం నైవేద్యం పెట్టి.. అందరికి పంచారు.
సుదీర్ఘ న్యాయ పోరాటం:
ఇరవై ఏళ్ల క్రితం క్రైస్తవ కుటుంబం వాల్మీకి ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. ఆలయ భూమి రెవెన్యూ రికార్డుల్లో ఈటీపీబీకి బదలాయించినా.. ఆ ఆస్తికి తామే వారసులం అంటూ క్రైస్తవ కుటుంబం 2010-2011లో కోర్టులో కేసు వేసింది. 1992లో భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం పాక్ లో హిందూ దేవాలయాల్లో జరిగిన విద్వంసంలో ఈ ఆలయం కూడా ధ్వసం అయింది. కృష్ణుడు, వాల్మీకి ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసం చేశారు. అంతే కాకుండా ఆలయ ప్రాంగణంలోని వంటశాలలోని పాత్రలను ధ్వంసం చేసి ఆలయంలోని విగ్రహాలకు అలంకరించిన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..