వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఎండల నుంచి రిలీఫ్.. టీటీడీ భలే ప్లాన్..!
రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల కొలిమిలా మారుతున్న వాతావరణం సామాన్యులను వణికిస్తోంది. ఈ వేడి సెగలు ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై పడకుండా ఉండేందుకు టీటీడీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. భక్తులకు కొండంత అండగా నిలుస్తూ దాదాపు రూ. 3.21 కోట్లతో వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

తిరుమల పుణ్యక్షేత్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల కొలిమిలా మారుతున్న వాతావరణం సామాన్యులను వణికిస్తోంది. ఈ వేడి సెగలు ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై పడకుండా ఉండేందుకు టీటీడీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. భక్తులకు కొండంత అండగా నిలుస్తూ దాదాపు రూ. 3.21 కోట్లతో వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
తిరుమల క్షేత్రం నిత్యం లక్షలాది మందితో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, గత రెండు మూడేళ్ల గణాంకాలను పరిశీలించిన అధికారులు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే సమయం, దర్శనం పొందే భక్తుల సంఖ్యను విశ్లేషించి, అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వంటి చోట్ల జారీ చేసే SSD టోకెన్లపై కూడా భక్తుల సౌలభ్యం కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా టీటీడీ ఆలోచిస్తోంది.
భక్తులు నడిచే దారుల్లో కాళ్లు కాలకుండా ఉండేందుకు టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. శ్రీవారి ఆలయ మాడవీధులతో పాటు భక్తులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో సుమారు రూ. 50 లక్షల వ్యయంతో కూల్ పెయింటింగ్ వేశారు. సేవా సదన్, వరాహ స్వామి గెస్ట్ హౌస్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వంటి ప్రాంతాలకు దీని ద్వారా ఉపశమనం లభించనుంది. అలాగే, బాట గంగమ్మ ఆలయం నుంచి బారికేడ్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయం ఎదుట అత్యాధునిక జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల భక్తులు నేరుగా ఎండ తగలకుండా క్యూలైన్లలో వేచి ఉండవచ్చు. నడక దారిలో వచ్చే భక్తుల కోసం అదనపు షెడ్లు, మరుగుదొడ్లు, చల్లని తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచారు. శ్రీవారి ఆలయం చుస్తుపక్కల లడ్డు కౌంటర్ ప్రాంతాల్లో షెల్టర్ ఏర్పాటు చేస్తున్న టీటీడీ భక్తులు నడిచే నాలుగు మాలా వీధుల్లో రూ. 17 లక్షలతో, సేవా సదన్ వరాహ స్వామి గెస్ట్ హౌస్ ప్రాంతాల్లో రూ. 16 లక్షలతో, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల్లో రూ. 18 లక్షలతో కూల్ పెయింటింగ్ చేశారు. కళ్యాణకట్ట ఆస్థాన మండపం, PAC-4, రాంభగీచ వద్ద షెల్టర్లను ఏర్పాటు చేసింది.
గత ఏడాది సగటున రోజుకు 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి నిమిషాన్ని పర్యవేక్షిస్తోంది. డేటా అనలిటిక్స్ ఆధారంగా దర్శన సమయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్నప్రసాదం, లడ్డూ కౌంటర్లు, కల్యాణకట్ట వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా షెల్టర్లు నిర్మించడం ద్వారా ఎండ తీవ్రత నుంచి భక్తులకు పూర్తి రక్షణ కల్పిస్తున్నారు. మొత్తానికి, భానుడి భగభగలకు భయపడకుండా, భక్తులు ప్రశాంతంగా వేంకటేశ్వరుని దర్శించుకునేలా టీటీడీ చేసిన ఈ “కొండంత ఏర్పాట్లు” పట్ల భక్తజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
