Andhra Pradesh: తిరుమల తొలి గడప దేవుని కడప లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
తిరుమల తిరుపతి దేవస్థానం తొలిగడప దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.. ద్వజారోహణంతో ప్రారంభమై ఈనెల 19న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు మూగియనున్నాయి. కృపాచార్యుల వారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టించినట్లు ప్రతీతి. తిరుమల వరాహ క్షేత్రమైతే దేవుని కడప హనుమత్ క్షేత్రము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెనుక భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది.
కడప, ఫిబ్రవరి 10: దేవుని కడప బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిన్న రాత్రి ప్రారంభమైంది ఈరోజు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈనెల 19న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి . శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 10.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి… ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భక్తులు పుష్పాలను సమర్పించవచ్చు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
దేవుని కడప ఆలయ విశిష్టత..
తిరుమల తొలి గడప దేవుని కడప ఆలయము చాలా పురాతనమైనది. ఈ దేవాలయంలో కృపాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ప్రతీతి. తిరుమల వరాహ క్షేత్రమైతే దేవుని కడప హనుమత్ క్షేత్రము. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెనుక భాగంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ప్రత్యక్షంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని సేవించి స్వామి వారిని కడప రాముడని వెంకటాద్రి కడప రాముడని పేర్కొన్నారు. పూర్వం తిరుపతికి వెళ్లే యాత్రికులకు మార్గం ఇదే.
అయితే, ప్రతి ఒక్క భక్తుడు తిరుపతికి వెళుతూ దేవుని కడపలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాతనే తిరుమలేషుని దర్శించడం సాంప్రదాయంగా పాటించబడేది. ఇక్కడ రాజగోపురం తిరుమల శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం ఒకే కాలంలో నిర్మించినట్లు శాసనాలు కూడా ఉన్నాయి. స్వామి వారి రథోత్సవం, రథసప్తమి రోజున కన్నుల పండుగగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.
రథసప్తమి నాడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని సేవిస్తారు. స్వామివారిని ఉగాది రోజున మహమ్మదీయులు అధికంగా సేవించి వారి భక్తిశ్రద్ధలను చాటుకుంటారు. బీబీ నాంచారమ్మను శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడం వలన కడపలోని ముస్లింలందరూ వెంకటేశ్వర స్వామిని వారి బావగారుగా భావించి ప్రతి ఉగాది నాడు ఇక్కడ వారు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
10-02-2024 ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహనం.
11-02-2024 ఉదయం సూర్యప్రభవాహనం, రాత్రి, పెద్దశేష వాహనం.
12-02-2024 ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి సింహ వాహనం.
13-02-2024 ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం.
14-02-2024 ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి గరుడ వాహనం.
15-02-2024 ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజవాహనం.
16-02-2024 ఉదయం రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం.
17-02-2024 ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వ వాహనం.
18-02-2024 ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి హంసవాహనం, ధ్వజావరోహణం.
19-02-2024 న సాయంత్రం పుష్పయాగంతో బ్రహొత్సవాలు ముగియనున్నాయి .
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..