Tirumala: ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..

తిరుమల వెంకన్న దర్శనం కోసం.. నడక మార్గాల్లో కొండకెళుతున్నారా.. అయితే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. అయితే జాగ్రత్తల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న భక్తులు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Tirumala: ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో  వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..
Alipiri Steps
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Nov 30, 2024 | 8:20 AM

ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో కొండకు వెళ్తారు. అయితే ఈ ఏడాదిలోనే అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ పెళ్లయిన వారం రోజుల్లోపే బెంగళూరు కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండెపోటుకు గురైయ్యాడు. ఎన్నికలకు ముందు శ్రీవారి మెట్టు మార్గంలో ఒక పోలీసు అధికారి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ రోజు శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమల కొండ మెట్లు ఎక్కిన తెలంగాణలోని హన్మకొండకు చెందిన గడ్డం సమ్మరావు 500వ మెట్టు వద్ద గుండెపోటుకు గురయ్యాడు. కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ఇటీవల కాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు తరచుగా నమోదు అవుతూనే ఉన్నాయి. కోవిడ్ తరువాత గుండె పోటు మరణాలు ఎక్కువగా నడక మార్గంలో నమోదు అవుతుండటంతో టీటీడీ భక్తులకు పలు కీలక సూచనలు చేస్తోంది.

అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల నుంచి శ్రీహరి దర్శనం కోసం రోజూ కొండకు చేరే భక్తుల సంఖ్య 30 వేల మంది దాకా ఉంటోంది. నడక మార్గం లో చిరుతల సంచారం తో టీటీడీ ఆంక్షలు విధించడం వల్ల ఆ సంఖ్య అటు ఇటుగా ఉంటోంది. అయితే మొక్కులో భాగంగా నడక మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించు కోవాలనుకునే భక్తులు తగిన జాగ్రత్తలు, నియమాలు పాటించాలని టీటీడీ సూచిస్తోంది. తిరుమలకు కాలి నడకన వెళ్లే భక్తుల్లో అవగాహన కల్పించేలా కొన్ని సూచనలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో రాజగోపురం వద్ద ఈ మేరకు సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.

ఈ మధ్య కాలంలో భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అప్రమత్తమైన టీటీడీ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇప్పటికే భక్తుల భద్రత కు పెద్దపీట వేసిన టీటీడీ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు సూచనలు చేస్తోంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులున్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదంటోంది. ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదని చెబుతోంది.

ఇవి కూడా చదవండి

తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తోంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కనుక గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉందని అవగాహన కల్పిస్తోంది.

భక్తులు తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న టిటిడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవడం కూడా మంచిదని చెబుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని టిటిడి సూచిస్తోంది.

తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం పొందవచ్చన్న టీటీడీ భక్తులకు తెలియజేస్తోంది. దీర్ఘకాలిక కిడ్ని వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందని కూడా పేర్కొంటోంది. తిరుమలకు కాలినడకన రాదలచిన భక్తులు తప్పనిసరిగా టీటీడీ చేసిన సూచనలు పాటించవల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..