Tirumala: ఒక్క రోజులో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. కొనసాగుతోన్న భక్తుల రద్దీ..!
తిరుమలలో వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ముందస్తు ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారిని త్వరత్వరగా దర్శనం చేసుకుంటున్నారు. ఇది అన్ని విభాగాల సమన్వయంతో సాధ్యమైందని అదనపు ఈవో చెప్పారు. గురువారం రోజున రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం అయిందని పేర్కొన్నారు.

వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో గత వారం రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. సాధారణంగా గురువారం ఉదయం తిరుప్పావడ సేవ, సాయంత్రం పూలంగి సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సాధారణంగా రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది. అందుకనే గురువారం రోజున సాధారణంగా కేవలం 62 నుంచి 63 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకునే వీలు ఉంటుంది. అయితే అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి నేతృత్వంలో తిరుమలలోని అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ.. అదనంగా దాదాపు పదివేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే వీలుని కల్పించారు. శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. దీంతో తొలిసారి గురువారం రోజున 72,579 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపద్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విశేష కృషి చేసిన అన్ని విభాగాల సిబ్బందిని అదనపు ఈవో అభినందించారు. మరోవైపు భక్తులు దర్శనం కోసం వేచి ఉండే క్యూ లైన్లలో ఈవో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
దర్శన క్యూలైన్లలో ఆకస్మిక తనిఖీలు
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం వేకువజామున దర్శన క్యూలైన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కృష్ణతేజ విశ్రాంతి భవనం వద్ద క్యూలైన్లలో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీటిపై ఆరా తీశారు. అంతేకాదు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళం
హైదరాబాద్ కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ సత్య రోహిత్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ఒక పూట మధ్యాహ్నం భోజనం వడ్డించేందుకు ఉపయోగించాలని దాత కోరారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








