Kartika Masam: శివ పార్వతులకే తప్పలేదు.. కార్తీక మాసంలో ఈ ఒక్కటీ మరువకండి..
శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో వచ్చే అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు చేసే స్నాన, దాన, దీపదానాలతో పాటు, కేవలం దర్శించినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే విశిష్టమైన ఉత్సవం 'జ్వాలాతోరణం'. ప్రతి శివాలయంలో పౌర్ణమి సాయంత్రం వేళ ఈ ప్రత్యేక వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ తోరణం నుంచి దాటిన తర్వాత ఉట్టి చేతులతో రాకుండా ఈ ఒక్క పనీ చేయాలని పూర్వీకుల మాట..

శివాలయాల ఎదుట రెండు నిలువు కర్రలను పాతి, వాటికి అడ్డంగా ఒక కర్రను కట్టి, కొత్త ఎండుగడ్డిని చుడతారు. ఈ నిర్మాణానికి ‘యమద్వారం’ అనే పేరు కూడా ఉంది. ఈ నిర్మాణాన్ని నెయ్యి పోసి మంట పెట్టి వెలిగిస్తారు. జ్వాలలతో మండుతున్న ఈ తోరణం కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు. ఆ తర్వాత భక్తులు కూడా ఈ తోరణం కింద నుంచి దాటుతూ తమ పాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక పురాణాల్లో ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు..
యమలోక అగ్ని తోరణం: యమలోకంలోకి వెళ్ళినవారికి మొదటగా దర్శనమిచ్చేది అగ్నితోరణం. ఇది వాస్తవానికి పాపాత్ములకు యమధర్మరాజు వేసే ప్రథమ శిక్ష. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. ఈ భయంకరమైన శిక్షను తప్పించుకోవడానికి ఈశ్వరుడిని ప్రార్థించడమే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం కింద మూడు సార్లు వెళ్లి వచ్చిన వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. వారికి మరణానంతరం యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదని ప్రతీతి.
పరమేశ్వరుడికే తప్పలేదు : కార్తీక పౌర్ణమి రోజునే శివుడు త్రిపురాసురులను సంహరించి విజయం సాధించాడు. భర్త విజయానికి దిష్టి పోవడానికి, దోష పరిహారార్థం పార్వతీదేవి జ్వాలాతోరణం ఏర్పాటు చేసి ఆహ్వానించిందని ఒక పురాణ గాథ చెబుతుంది. మరొక కథనం ప్రకారం, క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు లోకకల్యాణం కోసం మింగిన తర్వాత, పార్వతీ పరమేశ్వరులు సైతం ప్రమాద నివారణ కోసం ఈ జ్వాలాతోరణాన్ని మూడు సార్లు దాటారని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీనాథుడి భీమేశ్వర పురాణం వర్ణన
కవి సార్వభౌముడు శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని తన భీమేశ్వర పురాణంలో అత్యద్భుతంగా వర్ణించారు.
“కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ ఘోర భీకర యమద్వార తోరణంబు..”
అంటే, కార్తీక మాసంలో భీమశంకరుడి నగరంలో జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళిన వ్యక్తికి, ప్రాణం పోయే సమయంలో భయంకరమైన యమద్వార తోరణం కనిపించదు అని దీని అర్థం.
తాత్విక కోణం, నమ్మకాలు
పాప ప్రక్షాళన: జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడవడం ద్వారా భక్తులు ప్రతీకాత్మకంగా “శివా! నేను చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా నీ బాటలోనే నడుస్తా” అని తమను తాము ప్రక్షాళన చేసుకున్నట్లు భావిస్తారు.
ఎవ్వరూ చెప్పని విషయం : జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులో, గడ్డివాములో, లేదా ధాన్యాగారంలో పెడతారు. ఈ గడ్డి ఉన్నచోట భూతప్రేత పిశాచ బాధలు ఇంటిలోకి రావని, సుఖశాంతులు కలుగుతాయని ప్రజలు విశ్వసిస్తారు. కాలిన గడ్డిని పశువులకు ఆహారంలో ఇవ్వడం వల్ల అవి వృద్ధి చెందుతాయని కూడా నమ్మకం.
జ్వాలాతోరణం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది పాప ప్రక్షాళన, ఈశ్వర కటాక్షం, యమ భయం నుంచి విముక్తిని కలిగించే ఒక గొప్ప ప్రతీక. అందుకే ఈ మహోత్సవంలో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలి.
గమనిక: ఈ వార్తలో అందించిన జ్వాలాతోరణ ఆచారం యొక్క విశిష్టత, ఫలితాలు, యమలోక రహస్యాలు పూర్తిగా పురాణాలు, మతపరమైన నమ్మకాలు, ఆచారాల ఆధారంగా పొందుపరచబడ్డాయి. భక్తులు తమ నమ్మకాన్ని బట్టి ఈ ఆచారాలను పాటించవచ్చు.




