USA: అమెరికాలో 90 అడుగుల హనుమాన్ మహా విగ్రహం.. ఆగస్టు 18న ఆవిష్కృతం
అమెరికాలోని హ్యూస్టన్ నగరం సుందరమయంగా మారింది. హనుమాన్ నామస్మరణతో మారుమోగుతోంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో..అభయ హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆగస్టు 18వ తేదీన.. హ్యూస్టన్‌లోని అష్టలక్ష్మీ ఆలయంలో..శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి చేతుల మీదుగా.. 90 అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్ ఆవిష్కృతమవుతుంది.

అగ్రరాజ్యంలో అభయాంజనేయ స్వామి అనుగ్రహం! అమెరికాలో మూడో అతిపెద్ద విగ్రహం!! అవును..అమెరికాలో ఏ నోటవిన్నా.. స్టాట్యూ ఆఫ్ యూనియన్ గురించే! హ్యూస్టన్లో ఏ ఇద్దరు భారతీయులు కలిసినా.. 90 అడుగుల అభయాంజనేయస్వామి ముచ్చటే!. హ్యూస్టన్ నగరం సుందరకాండ పారాయణాలతో పులకిస్తోంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న.. అభయ హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలతో పరవశిస్తోంది. ఆగస్టు 15న అంకురార్పరణ కార్యక్రమంతో ఉత్సవాలు ఆరంభమయ్యాయి. ఆగస్టు 16న వాస్తుపూజ, జలాధివాసం, వరలక్ష్మీ పూజ కార్యక్రమాలు దివ్యంగా జరిగాయి. అనంతరం సుందరకాండ పారాయణం, అగ్ని ప్రతిష్ఠ, హోమ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సీతారాముల కథను సుందరమయం చేసినవాడు ఆంజనేయుడు!. రాముడే హనుమంతుని సర్వస్వం. రామనామస్మరణే ఆంజనేయునికి అత్యంత ప్రియం!. అందుకే, ఆగస్టు 17-ఉత్సవాల మూడో రోజున సామూహిక శ్రీరామ పాదుకారాధనకు సంకల్పించారు..శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి! అనంతరం శయ్యాధివాసం..ఆపై సుందరకాండ పారాయణం, కర్మాంగ స్నపనంగా పేర్కొనే ప్రత్యేక అభిషేకం…చూసిన కన్నులు ధన్యం!.
ఇక ఆగస్టు 18న హ్యూస్టన్ నగరంలో యావత్ భక్తకోటి ఎదురుచూస్తున్న మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది. మహాపూర్ణాహూతి, మహా కుంభ సంప్రోక్షణ క్రతువులతో..హ్యూస్టన్‌లోని దివ్య అష్టలక్ష్మీ ఆలయంలో..భవ్యమైన అభయాంజనేయ స్వామి విగ్రహానికి.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. 90 అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్ మహా విగ్రహాన్ని లోకార్పణం గావిస్తారు..శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి!
భాగ్యనగరంలో 216 అడుగుల భగవద్రామానుజుల భవ్య విగ్రహాన్ని ఆవిష్కరించి..సమతా సందేశాన్ని వినిపించారు..శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి..! ఇప్పుడు సప్త సముద్రాలకావల..అమెరికాలో..90 అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్‌తో..ఐక్యతా సందేశాన్ని అందిస్తున్నారు..ఆ కారుణ్యమూర్తి!
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
