Tirumala Brahmotsavalu: హనుమంత వాహనంపై కోదండరాముడిగా వేంకటపతి.. సేవలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారు ఇవాళ (ఆదివారం) హనుమంత వాహనంపై ఊరేగారు. తిరుమాడ వీధుల్లో..
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారు ఇవాళ (ఆదివారం) హనుమంత వాహనంపై ఊరేగారు. తిరుమాడ వీధుల్లో హనుమంత వాహనంపై కోదండరాముడిగా మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవను కళ్లారా చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ హనుమంత వాహన సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర పాల్గొన్నారు. మొత్తం 28 కంపార్టుమెంట్లలో సర్వ దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వీరందరికీ దర్శనం కల్పించేందుకు 12 గంటల సమయం పడుతోంది. సాయంత్రం స్వర్ణరథం, రాత్రికి గజవాహన సేవ జరగనుంది.
కాగా.. ఉత్సవాల్లో భాగంగా నిన్న (శనివారం) రాత్రి కలియుగ వైకుంఠ నాథుడు తనకెంతో ఇష్టమైన గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ అభయ హస్తం అందించాడు. ఏనుగులు, అశ్వాలతో గరుడవాహన సేవ వైభవంగా జరిగింది. గరుడసేవను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల కొండలు భక్తజనసంద్రంగా మారింది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గ్యాలరీల్లో రెండు లక్షల మంది, షాపింగ్ కాంప్లెక్స్ నుంచి భక్తులను రెండవసారి అనుమతించడం ద్వారా మరో 25 వేల మందికి అదనంగా దర్శనం కల్పించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శనివారం శ్రీవారిని 81,318 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,464 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 2.94కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..