Srisailam: స్వర్ణరథంపై విహరించిన ఆది దంపతులు.. చూసేందుకు భక్తులకు రెండు కళ్ళు చాలలేదు
శివ పార్వతులు కొలువైన క్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంతో పాటు అమ్మవారి అష్టాదశ పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న శ్రీ గిరి క్షేత్రం. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఘనంగా స్వర్ణరథోత్సవం నిర్వహించారు. దగదగలాడుతూ, కాంతులినుతున్న బంగారు రథంపై ఆది దంపతులు విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆదిదంపతులను చూసేందుకు భక్తులకు రెండు కళ్ళు చాలలేదు
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోకాకళ్యాణార్ధం శ్రీస్వామి అమ్మవారికి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీమల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథోత్సవంలో ఆశీనులైన శ్రీస్వామి అమ్మవారికి అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. స్వర్ణరథాన్ని ఆలయ మాడవీధులలో రాజగోపురం, హరిహరరాయ గోపురం, బ్రహ్మానందరాయ గోపురం, శివాజీ గోపురం మీదుగా మాడవీధులలో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు, గిరిజనుల నృత్యాలు మేళతాళాలతో వైభవంగా జరిగింది.
స్వర్ణరథోత్సవంలో వందలాదిగా స్థానికులు, భక్తులు తరలివచ్చి స్వర్ణరథోత్సవం తిలకించారు. స్వర్ణరథంలో ఆశీనులైన శ్రీస్వామి అమ్మవారు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ప్రతీమాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈ స్వర్ణరథోత్సవాన్ని నిర్వహిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..