Srisailam: మంగళగిరికి చేరుకున్న మల్లన్న తలపాగా.. అరుదైన సాంప్రదాయం వెనుక విశిష్టత ఏమిటో తెలుసా..
శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం శివరాత్రి రోజున మల్లికార్జున స్వామికి తలపాగా అలంకరించే ఘట్టం అత్యంత విశిష్టమైనది. అర్థరాత్రి లింగోద్భవ కాలం, శివపార్వతుల కళ్యాణం కంటే ముందు మల్లన్నకు పాగాలంకరణ చేయడం అనాథిగా వస్తున్న సంప్రదాయం.
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామంలో ప్రత్యేక మగ్గాల పై నేసిన శ్రీశైల మల్లన్న తలపాగా మంగళగిరికి చేరుకుంది. మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో లపాగాకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతుడు ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి పాల్గొన్నారు. పూజల అనంతరం ఈ శ్రీశైల మల్లన్న తలపాగాను భక్తుల దర్శనార్ధం ఉంచారు.
శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం శివరాత్రి రోజున మల్లికార్జున స్వామికి తలపాగా అలంకరించే ఘట్టం అత్యంత విశిష్టమైనది. అర్థరాత్రి లింగోద్భవ కాలం, శివపార్వతుల కళ్యాణం కంటే ముందు మల్లన్నకు పాగాలంకరణ చేయడం అనాథిగా వస్తున్న సంప్రదాయం. మహా శివరాత్రి రోజున దేవస్థానం అన్ని ద్వారాలు మూసివేసి దీపాలు ఆపివేసి దేవాంగ వంశస్తులు దిగంబరంగా అర్ధరాత్రి లయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ 150 గజాలు ఉండే తలపాగా చుడతారు. ఇలా తలపాగా కట్టిన తర్వాతనే భారతదేశంలో ఉన్న ఏ శివాలయంలోనైనా శివపార్వతుల కళ్యాణం మొదలు పెడతారు. మల్లికార్జున స్వామికి భ్రమరాంబతో పెళ్లి తంతు మొదలవుతుంది.
తలపాగా చరిత్ర:
సుమారు 200 ఏళ్ళ నుంచి శ్రీశైలంలో తలపాగా చుట్టే సంప్రదాయం కొనసాగుతున్న దాఖలాలు ఉన్నాయి. కఠిన నియమాలను అనుసరిస్తూ.. స్వయంగా వస్త్రాలు నేసి.. స్వహస్తాలతో శివుడికి అలంకరించే దివ్య అవకాశాన్ని ఏపీలోని మూడు ప్రాంతాలకు చెందిన దేవాంగ కులస్తులకు దక్కింది. కొన్ని వందల ఏళ్లుగా ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపూరికి చెందిన పృథ్వి వెంకటేశ్వర్లు కుటుంబం, శ్రీకాకుళం నగరంలోని ఫాజులబాగ్ పేట దేవాంగ వీధి కి చెందిన తూతిక మల్లయ్య కుటుంబం, పొందురుకు చెందిన బల్ల కుమారస్వామి కుటుంబాలు శివరాత్రి నాడు తలపాగాకు అవసరమైన వస్త్రాన్ని తయారు చేసి సమర్పిస్తూ ఉంటారు.
తలపాగా అలంకరించే సమయంలో కఠిన ఆంక్షలు:
స్వామివారికి తలపాగా అలంకరణ సమయంలో కఠిన ఆంక్షలు విధిస్తారు. అర్థరాత్రి జరిగే లింగోద్భవ కాలానికి ముందు..అంటే రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయ ప్రవేశాలు నిలిపివేస్తారు. ఆలయంలోని దీపాలు మొత్తం ఆర్పివేస్తారు. అనంతరం తలపాగాని అలంకరింపజేస్తారు. స్వామి స్పర్శతో పవిత్రత సంతరించుకున్న ఆ వస్త్రాలను శివరాత్రి ఉత్సవాల అనంతరం దేవస్థానం వారు వేలం వేస్తారు. కల్యాణం అనంతరం ఈ వస్త్రాన్ని వేలంలో దక్కిం చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సైతం పోటీపడతారు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)