Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో వెండి నాణేల పంపిణీ.. పోటెత్తిన భక్తులు
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దీపావలి వేడుకలు మిన్నంటాయి. పిల్లలు, పెద్దలు కోలాహలంగా టపాసులు కాలుస్తూ ఆనందంగా పండగ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో పండగనాడు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావలి సంబరాలు మిన్నంటాయి..
హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీపావలి వేడుకలు ఘనంగా జరిగాయి. రకరకాల దీపాలతో ఇళ్లన్నీ కాంతులీనాయి. ఇంటిళ్లిపాదీ టపాసులు కాలుస్తూ ఆనందంగా గడిపారు. ఇళ్లతోపాటు పలు షాపులు, రెస్టారెంట్లు దీపాల అలంకరణతో ముచ్చటగొలిపాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిన్నాపెద్దా అంతా కలిసి ఆనందోత్సాహాల నడుమ బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో నరకాసుర వధ నిర్వహించారు
ఇక హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దీపావళి వేడుకలు అంగనంగ వైభవంగా జరిగాయి. ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇక్కడ దీపావళి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలు పంపిణీ చేశారు.
ఏడాదంతా అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి నాణేలను దీపావళి రోజు భక్తులను అందించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ మేరకు ఈ దీపావలి రోజున కూడా భక్తులకు వెండి నాణెలు పంపిణీ చేసినట్లు ఆలయ ట్రస్టీ శంభు వివరించారు. ఇక ఆలయంతో ఇస్తున్న వెండి నాణేల కోసం భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా జనాలతో కిటకిటలాడింది.