Saraswati Pushkaralu: నేటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం.. సాయత్రం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో సహా పుణ్య స్నానం..
సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పండగ పుష్కరాలు. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు సరస్వతి నదీ పుష్కరాలు జరుపుకుంటారు. ఈ నేపద్యంలో ఈ రోజు నుంచి సరస్వతి నదీ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. అంతర్వాహిని సరస్వతీ నది తెలంగాణా రాష్ట్రంలో ప్రవహిస్తుందని నమ్మకం.

సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు వేద పండితులు. నది హారతి, పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కుటుంబసమేతంగా త్రివేణీ సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఘన సరస్వతి ఘాట్‌లో సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సప్త హారతులు వీక్షిస్తారు
కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద చేసే స్నానాలు, పూజలకు పవిత్ర సంగమంగా పరిగణించబడుతుంది. మూడు నదుల సంగమమైన ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక పరంగా విశేష ప్రాముఖ్యత ఉంది. స్వరస్వతి పుష్కరాల సమయంలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శుద్ధి లభిస్తుందని.. వ్యక్తిగత కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు.
12 రోజులు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, శ్రీ మహా సరస్వతి అమ్మవారి ఆలయం వంటి ప్రధాన ఆలయాలలో వివిధ రకాల హోమాలు, పూజలు, హారతులు నిర్వహిస్తారు. గోదావరి, సరస్వతి ఘాట్లలో స్నానం ఆచరించి .. పూర్వీకులను గౌరవించడానికి తర్పణం అర్పిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




