దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి అరుదైన గుర్తింపు.. అంతర్జాతీయ స్థాయికి ఆలయ కీర్తి ప్రతిష్టలు..
హైదారాబాద్‌లో ఎన్ని సాయిబాబా దేవాలయాలు ఉన్నా.. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి ఉన్న ప్రత్యేకతే వేరు. కారణం.. నిర్మాణంలో ఈ గుడి అచ్చం షిరిడీలోని సాయిబాబా దేవాలయాన్ని తలపిస్తూ ఉంటుంది.
శ్రద్ధ.. సబూరి.. అంటే నమ్మకం.. ఓపిక.. నమ్మకం సాధించలేనిది ఏముంటుంది? ఓర్పుతో జయించలేనిది ఏముంటుంది? సాయినాథుడిపై అచంచలమైన భక్తుల విశ్వాసం.. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబు ఆలయాన్ని దక్షిణ షిరిడీని చేసింది. ఆలయ పాలకవర్గం 30ఏళ్లుగా ఓర్పుతో చేస్తున్న సేవలు, ఆలయ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలకు తాజాగా ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చేలా చేసింది. హైదరాబాద్‌లో ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన మొదటి దేవాలయంగా రికార్డ్ సృష్టించింది దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం.
ఈ ఆలయ ప్రత్యేకతే వేరు.. హైదారాబాద్‌లో ఎన్ని సాయిబాబా దేవాలయాలు ఉన్నా.. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి ఉన్న ప్రత్యేకతే వేరు. కారణం.. నిర్మాణంలో ఈ గుడి అచ్చం షిరిడీలోని సాయిబాబా దేవాలయాన్ని తలపిస్తూ ఉంటుంది. అందుకే ఈ మందిరాన్ని దక్షిణ షిరిడీగా పిలుస్తుంటారు భక్తులు. ఆలయం లోపల ప్రశాంత వదనంతో కనిపించే సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని పాలకమండలి ఆధ్వర్యంలో 1989లో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటోంది ఈ విగ్రహాన్నే. అంతకు ముందున్న పాత విగ్రహాన్ని ఆలయ ఎడమవైపు దర్శనార్థం ఉంచారు. ఇక 1991లో మొదటి అంతస్తు నిర్మించి ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. 1993లో దేవాలయ మెయిన్ ఆర్చ్‌ని నిర్మించగా.. 1994లో సాయినాథునికి స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు. 1996లో ఆలయం రెండో అంతస్తు నిర్మించారు. మొదట్లో చాలా చిన్నగా ఉన్న దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం.. తరువాత తరువాత అనేక ఆలయాల సముదాయంగా వెలసి విరాజిల్లుతోంది. భక్తుల కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయనే నమ్మకం.. ఒక్కసారి మనసారా ప్రార్థిస్తే అనుకున్నది జరుగుతుందనే ప్రచారం దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి భక్తుల రాకను మరింత పెంచింది.
అందరి మన్ననలు పొంది.. అరుదైన గుర్తింపు సాధించి.. కోరికలు తీర్చడంలోనే కాదు.. తనను నమ్మి వచ్చే వారికి సరైన వసతులు కల్పించడం.. అన్నదాన సేవతో భక్తుల ఆకలి తీర్చడం.. నాణ్యమైన ప్రసాదాల తయారీ.. ఇలా భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తూ అందరి మన్ననలు పొందిన దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయం తన సేవలకు గానూ తాజాగా అంతర్జాతీయ గుర్తింపును సైతం పొందింది. గుడికి వచ్చే భక్తులకు వసతుల కల్పనతో పాటు ప్రసాదాల తయారీలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు గానూ దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ ఆలయంపై భక్తుల నమ్మకానికి, సేవల్లో పాలకవర్గం ఓర్పు, నేర్పునకు ఈ సర్టిఫికెట్ నిదర్శనంగా నిలుస్తుంది. సాయినాథుడు ఉపదేశించిన శ్రద్ధా.. సబూరి.. అంటే నమ్మకం, ఓపికల గొప్పదనం మరోసారి రుజువైంది. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల్లో ఉన్న దేవాలయాలకు గుర్తింపు దక్కడం సహజం. అలా గతంలో చాలా ఆలయాలు గుర్తింపు పొందాయి కూడా. ఇలాంటి క్షేత్రాల సరసన దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా మందిరం చోటు దక్కించుకోవడం అనేది నిజంగా అపూరమనే చెప్పాలి.
ఐఎస్ఓ సర్టిఫికెట్ ప్రాముఖ్యత ఏంటి? ఒక వస్తువు నాణ్యతను తెలుసుకోవడానికి అగ్‌మార్క్, ఐఎస్ఐ ముద్రల్లాంటివి ఉన్నట్లే.. కంపెనీలు, ట్రస్ట్‌ల నిర్వహణలో పాటించే ప్రమాణాలను చాటడానికి ఐఎస్ఓ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. జెనీవాలోని ఇంటర్నేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ వీటిని అందిస్తోంది. పెద్ద ఎత్తున సేవలు అందించే సంస్థలకు సైతం ఐఎస్ఓ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. అలా అనేక దేవాలయాలు కూడా ఐఎస్ఓ ధృవీకరణ పత్రాలను పొందుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత పొందిన వాటిల్లో టీటీడీది మొదటి స్థానం. టీటీడీ ఆధ్వర్యంలో సేవలు అందించే వివిధ సంస్థలకు పెద్ద సంఖ్యలో ఐఎస్ఓ సర్టిఫికెట్లు జారీ అయ్యారు. ఆలయాల విషయంలో ఐఎస్ఓ సర్టిఫికెట్లు దక్కించుకున్న ఘనత మాత్రం తెలంగాణలోని యాదాద్రి పుణ్యక్షేత్రానిదే. ఆలయాన్ని అద్భుతమైన ప్రమాణాలతో నిర్వహించడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ, భద్రత, విద్యుత్ సరఫరా విభాగాల్లో మెరుగైన సదుపాయాలు అందిస్తున్నందుకు యాదాద్రి ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను సాధించింది.
చాలా పెద్ద తతంగమే ఉంటుంది.. తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లోని షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భక్తులకు మెరుగైన వసతుల కల్పన, ప్రసాదాల్లో నాణ్యతకు సంబధించి ప్రతిష్టాత్మక ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్‌ను అందుకుంది. నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు, హారతి సేవలు ఇవే కాదు.. అడుగడుగునా పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు ఆలయానికి ఈ ఘనతను సాధించి పెట్టాయి. క్వాలిటీ మేనేజ్‌మెంట్స్ స్టాండర్డ్స్ విషయంలో అధిక ప్రాధాన్యత ఇచ్చే వారికి ఐఎస్ఓ ధృవీకరణ లభిస్తుంది. ఐఎస్ఓ సర్టిఫికెట్ జారీ వెనుక పెద్ద ప్రక్రియే ఉంటుంది. ధృవీకరణ పత్రం జారీ చేసే ముందు గుర్తింపు ఇవ్వాలనుకున్న సంస్థ పని తీరును, పాటిస్తున్న ప్రమాణాలను కొంతమంది సభ్యులు బృందంగా ఏర్పడి రోజుల తరబడి పరిశీలిస్తారు. వారు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితే అప్పుడు ఈ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటించే సంస్థలకు ఐఎస్ఓ ప్రత్యేకంగా అందించే ఈ సర్టిఫికెట్లకు అంతర్జాతీయ ప్రాధాన్యతతో పాటుగా ప్రమాణికంగానూ చూస్తారు. ఉన్నత ప్రమాణాలు పాటించాలన్నా.. వాటిని కొనసాగించాలన్నా ఒక్కరితో అయ్యే పని కాదు. యాజమాన్యంతో పాటు సిబ్బంది సహా అంతా అడుగడుగునా జాగ్రత్తలు పాటిస్తూ క్రమశిక్షణగా ఉన్నప్పుడే ఇలాంటివి సాధ్యమవుతాయి.
ఎక్కడా రాజీ పడలేదు… దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రమాణాలు, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు కాబట్టే అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ముఖ్యంగా ప్రసాదాల తయారీలో శుభ్రతా నియమాలు కట్టుదిట్టంగా పాటిస్తుందనే ఘనత దక్కించుకుంది. నిజానికి ప్రసాదాల తయారీ అంటే అందరి మదిలో మెదిలేది తిరుమల లడ్డూనే. తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు, తయారీ అంతా విభిన్నం. అందుకే రుచితో పాటే ఆధరణ విషయంలో అందనంత ఎత్తులో ఉంటుంది తిరుమల లడ్డు. దిల్‌సుఖ్‌నగర్‌లో సాయిబాబా ఆలయం సైతం ప్రాసాదాల తయారీ విషయంలో ఇలాంటి ఉన్నత ప్రమాణాలనే పాటిస్తోంది. అందుకే ఎన్నో ప్రముఖ క్షేత్రాలు, ప్రఖ్యాత దేవాలయాల కన్నా ముందే ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను సాధించింది. ఐఎస్ఓ గుర్తింపు అంటే.. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయ ప్రాఖ్యాతలు హైదరాబాద్, దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి పెరిగినట్లే. అంతా సాయి మహిమ అన్నట్లుగా ఇప్పుడు దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయ కీర్తిప్రతిష్టలు జగమంతా విస్తరించాయి.