ఉబికి వస్తున్న పాతాళ గంగమ్మ.. ఈ నీరు సర్వరోగ నివారిణి.. ఎక్కడుందంటే..?
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి శివారులోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం. ప్రకృతి సోయగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం.. నాలుగు శతాబ్దాల చరిత్రను తన గర్భగుడిలో దాచుకుని, భక్తుల మనసుల్లో భక్తి జ్యోతిని వెలిగిస్తోంది. బండరాళ్ల మధ్య నుంచి ఉబికే జలధార.. అబ్బురపరిచే దృశ్యంతో భక్తులు పులకించిపోతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి శివారులోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం. ప్రకృతి సోయగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం.. నాలుగు శతాబ్దాల చరిత్రను తన గర్భగుడిలో దాచుకుని, భక్తుల మనసుల్లో భక్తి జ్యోతిని వెలిగిస్తోంది. బండరాళ్ల మధ్య నుంచి ఉబికే జలధార.. అబ్బురపరిచే దృశ్యంతో భక్తులు పులకించిపోతున్నారు.
శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం కింది భాగంలో భారీ బండరాళ్ల మధ్య నుంచి నిరంతరం ఉబికి వచ్చే జలధారను చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వర్షాలు లేక కరవు కోరల్లో కూరుకుపోయిన కాలాల్లోనూ ఈ బుగ్గ మాత్రం ఎప్పుడూ ఎండిపోలేదు. అదే ఇక్కడి ప్రత్యేకత. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ నీటి ఉత్సాహం కూడా పెరుగుతుందన్న నమ్మకం ఇక్కడ తరతరాలుగా వినిపిస్తోంది.
నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్టించారని గ్రామస్థులు చెబుతారు. ఆ తపస్సు మహిమ వల్లే బండరాళ్ల మధ్య నుంచి చెలమ రూపంలో నీరు నిరంతరం ఉబికి వస్తోందన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం “బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం”గా ప్రాచుర్యం పొందింది. ఆళ్వారుల విగ్రహాలతో చారిత్రక వైభవం ఆలయానికి సమీపంలోని వేంకటేశ్వరుని గుట్టపై వెలసిన ఆళ్వారుల విగ్రహాలు ఈ ప్రాంతానికి మరింత చారిత్రక ప్రాధాన్యం తీసుకొచ్చాయి. ఆధ్యాత్మికతతో పాటు వైష్ణవ–శైవ సంప్రదాయాల సమ్మేళనంగా ఈ క్షేత్రం ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
రోగ నివారణ.. పంటల రక్షణపై అపార విశ్వాసం..!
బుగ్గ నీటితో స్నానం చేస్తే సర్వ రోగాలు నయమవుతాయన్న నమ్మకం భక్తుల్లో ఉంది. ఆ నీటిని వెంట తీసుకెళ్లి పొలాల్లో చల్లితే చీడపీడలు తొలగిపోతాయని రైతులు విశ్వసిస్తారు. అందుకే రైతులు ప్రత్యేకంగా ఈ ఆలయానికి వచ్చి కోనేరులో పవిత్ర స్నానాలు చేసి నీటిని తమ గ్రామాలకు తీసుకెళ్తుంటారు.
శివరాత్రి వేళ.. ఓంకార నాదం వినిపిస్తుందా?
ఏటా మాఘ అమావాస్య, మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శివరాత్రి రాత్రివేళ ఆలయ పరిసరాల్లో విడిది చేస్తే, ఓంకార శబ్దాలు వినిపిస్తాయని గ్రామస్థులు చెబుతుండటం మరో ఆసక్తికర విషయం.
భక్తి.. ప్రకృతి.. చరిత్ర..
మూడు కలిసిన అరుదైన క్షేత్రం భక్తిని పెంపొందించే ఆధ్యాత్మిక వాతావరణం, మనస్సుకు ప్రశాంతతనిచ్చే ప్రకృతి సోయగం.. తరతరాల చరిత్రను గుర్తు చేసే శిల్ప వైభవం.. ఈ మూడింటి సమ్మేళనమే బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఒక్కసారి దర్శించుకుంటే, మళ్లీ మళ్లీ రావాలనిపించే అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం ఇది..!
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
