Vastu Tips: ఇంటి వాస్తు ఇలా చేస్తే అన్ని శుభాలే.. నిర్మాణంలో లోపాలను ఇలా గుర్తించండి..
ఇంటి వాస్తు దోషాలపై దృష్టి సారించకపోతే.. మానసిక ప్రశాంతత ఉండదని వాస్తుశాస్త్రం చెబుతోంది.. ఇంటి నిర్మాణంలో ఉన్న చిన్న చిన్న తప్పులు గుర్తించకపోతే.. యజమానికి తీవ్ర ఇబ్బందులు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కొన్ని దోషాలను సరిదిద్దుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని వాస్తుశాస్త్రం చెబుతోంది.

Vastu Tips: జ్యోతిషశాస్త్రం ఒక వ్యక్తి జీవితంపై ప్రభావం చూపినట్లుగానే వాస్తు శాస్త్రం కూడా ఎంతో ప్రభావం చూపుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది మన జీవితాలను , మన ఇంటి శక్తిని ప్రత్యక్షంగా ప్రభావితం చూపుతుంని పండితులు పేర్కొంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం, లేఅవుట్ కుటుంబ శ్రేయస్సు, ఆర్థిక వృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. అయితే, కొన్నిసార్లు నిపుణులైన వాస్తు సిద్ధాంతుల సలహా తీసుకున్నా కూడా, అవగాహన లోపం లేదా సంప్రదాయ పరిజ్ఞానం సరిపోకపోవడం వల్ల ఎన్నో లోపాలు తలెత్తుతాయి. వాస్తు పండితుల ప్రకారం.. అలాంటి వాస్తు దోషాలను, వాటి ప్రభావాలను తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం ఇల్లు ఎంత అద్భుతంగా నిర్మించినప్పటికీ, బయటి లేఅవుట్‌లో కొన్ని కీలక లోపాలు ఉంటాయని పండితులు పేర్కొంటున్నారు. వీటిలో ప్రధానమైనది ఈశాన్య భాగాన్ని కాంపౌండ్‌లోకి వదిలేయడం. దీనిని “ఈశాన్యం లెస్” అంటారు, ఇది వాస్తు శాస్త్రంలో తీవ్రమైన దోషంగా పరిగణించబడుతుంది. ఈశాన్యం లెస్ అయినప్పుడు, ఇల్లు దాదాపు వాస్తు రహితంగా మారుతుందని, దీని వల్ల యజమానికి ఆర్థిక నష్టాలు, ప్రమాదాలు, ఆస్తి కోల్పోవడం వంటి అనేక అనర్థాలు సంభవిస్తాయని పండితులు స్పష్టం చేశారు. ఈ సమస్యను సరిదిద్దడానికి, ఈశాన్యంలో గ్రిల్ లేదా గేటు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
మరొక ముఖ్యమైన లోపం ఇంటి బయట బట్టలు ఆరేసుకోవడానికి వాడే వైర్లు. ఇంటి నుంచి ఏ భాగంలో వైర్లు కట్టినా అవి సవ్య, అపసవ్యాలుగా పనిచేసి ప్రతికూల ఫలితాలనిస్తాయని, వాటిని తక్షణమే తొలగించాలని పేర్కొంటున్నారు.
అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో చాలా స్థలం ఉంటుంది.. దాన్ని అలానే వదులుతారు. ఇంటి చుట్టూ వదిలిన ఖాళీ స్థలంలో అసమానతలు ఉండటం.. ముఖ్యంగా తూర్పు, ఉత్తరం వైపు ఖాళీ స్థలాన్ని వదలడం.. ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం వల్ల వచ్చిన డబ్బు నిలవకుండా ఖర్చు అవుతుందని, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని పేర్కొంటున్నారు.
తూర్పు, ఉత్తరం రోడ్లు ఉండగా, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం దిశల్లో రెండు గేట్లు పెట్టడం కూడా మరొక తీవ్రమైన దోషమంటున్నారు. రెండు గేట్లు ఉండటం వల్ల ఈశాన్య భాగం లోపిస్తుంది. ఇది “ఈశాన్యం లెస్” పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది. ఒక గేటు మాత్రమే ఉండాలని, లేదా అవసరమైతే తూర్పు మధ్యభాగంలోనో, ఉత్తర మధ్యభాగంలోనో పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. ఈశాన్యంలో 30 అడుగుల బావి, సంప్, మంచి నీటితో ఉండటం శుభప్రదమైన అంశమని అలా ఉంటే తిరుగుండదని పేర్కొంటున్నారు.
100 శాతం వాస్తును అనుసరించి ఇల్లు కట్టుకున్నామని భావించినా.. లోపాలను గమనించకపోతే.. ఆర్థికంగా, వ్యవసాయపరంగా, ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.. వాస్తు దోషాలు చిన్నవిగా కనిపించినా అవి మేజర్ దోషాలుగా మారి జీవితంలో ప్రతికూల ప్రభావాలను చూపుతాయంటున్నారు.
Note: ఈ వార్తలోని సమాచారం మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.
