AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangla Gauri Vratam: కుజ దోషంతో వివాహం ఆలస్యం అవుతుందా.. ఈ రోజున శివపార్వతులను ఇలా పూజించండి..

వైవాహిక జీవితంలో ఏదైనా అడ్డంకులు ఏర్పడినా లేదా వైవాహిక జీవితం ఇబ్బందులతో సాగుతున్నట్లయితే మంగళగౌరీ వ్రతం రోజున తీసుకోవాల్సిన కొన్ని ప్రత్యేక చర్యలు జ్యోతిషశాస్త్రంలో సూచించబడ్డాయి. ఈ పరిహారాలు చేయడం ద్వారా వివాహంలోని అడ్డంకుల నుండి ఖచ్చితంగా ఉపశమనం పొందుతారని.. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. పెళ్లికాని యువతులకు త్వరలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి.

Mangla Gauri Vratam: కుజ దోషంతో వివాహం ఆలస్యం అవుతుందా.. ఈ రోజున శివపార్వతులను ఇలా పూజించండి..
Mangala Gauri Vratam
Surya Kala
|

Updated on: Aug 06, 2024 | 7:01 AM

Share

శ్రావణ మాసంలో మంగళవారం ‘మంగళ గౌరీ వ్రతాన్ని’ నిర్వహించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం పొందుతారని.. ఆ స్త్రీల భర్తలు దీర్ఘాయుష్షు పొందుతారని విశ్వాసం. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి కూడా ఉంటుంది. మంగళ గౌరీ దేవి వ్రతం రోజున ఉపవాస చేసే సమయంలో, పూజ సమయంలో మంగళ గౌరీ వ్రత కథను వినడం అత్యంత పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. పెళ్లికాని అమ్మాయిలు కూడా తమకు నచ్చిన వరుడిని పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

పార్వతి దేవి పవిత్రమైన రూపాన్ని మంగళ గౌరి అంటారు. మంగళ గౌరీని సంతోషం, శ్రేయస్సు, అఖండ సౌభాగ్యానికి దేవతగా భావిస్తారు. వివాహిత స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం, అదృష్టం కోసం మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళ గౌరీ వ్రతం రోజున పార్వతితో పాటు శివుడు కూడా పూజలు అందుకుంటాడు.

వైవాహిక జీవితంలో ఏదైనా అడ్డంకులు ఏర్పడినా లేదా వైవాహిక జీవితం ఇబ్బందులతో సాగుతున్నట్లయితే మంగళగౌరీ వ్రతం రోజున తీసుకోవాల్సిన కొన్ని ప్రత్యేక చర్యలు జ్యోతిషశాస్త్రంలో సూచించబడ్డాయి. ఈ పరిహారాలు చేయడం ద్వారా వివాహంలోని అడ్డంకుల నుండి ఖచ్చితంగా ఉపశమనం పొందుతారని.. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. పెళ్లికాని యువతులకు త్వరలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. కుజ దోషంతో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఈ నివారణల నుండి ప్రయోజనం పొందుతారు. ఈ రోజు శ్రావణ మాసంలో మొదటి మంగళ వారం మంగళ గౌరీ వ్రతం జరుపుకుంటారు. ఈ రోజున ఈ పరిహారాలు చేయడం వలన పెళ్లి కాని యువతులకు వివాహం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మంగళ గౌరీ వ్రతం రోజున చేయాల్సిన పరిహారాలు

జాతకంలో కుజుడు బలహీనంగా ఉండటమే వివాహం ఆలస్యం కావడానికి కారణం. మంగళగౌరీ వ్రతం రోజున అంగారకుడు బలపడడానికి, వివాహం కుదరడానికి పప్పు, ఎరుపు రంగు దుస్తులను పేద లేదా అవసరం ఉన్న వ్యక్తులకు దానం చేయండి.

మంగళ దోష నివారణ కోసం మంగళ గౌరీ వ్రతం రోజున మంగళ గౌరీ, శివుడు, హనుమంతుడిని పూర్తి ఆచారాలతో పూజించండి. పూజ సమయంలో ‘ఓం గౌరీ శంకరాయ నమః’ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి.

వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయి మంగళ గౌరీ వ్రతం రోజున పార్వతీ దేవికి పదహారు అలంకరణ వస్తువులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి.

మంగళ గౌరీ వ్రత కథ

పురాణాల ప్రకారం ఒక నగరంలో ధర్మపాలుడు అనే ధనిక వ్యాపారవేత్త నివసించేవాడు. అతని భార్య చాలా అందంగా ఉండేది. మర్యాద, మన్నన తెలిసిన భార్య. వ్యాపారవేత్తకు చాలా సంపద ఉంది, అయితే ఈ దంపతులకు సంతానం లేరు. దీంతో ఎప్పుడూ తమకు పిల్లలు లేరని ఎప్పుడూ బాధపడేవారు. పిల్లలు లేకపోవడంతో విలపించేవారు. భగవంతుని దయతో వారికి ఎట్టకేలకు కొడుకు పుట్టాడు. అయితే ఆ కొడుకు అల్పాయుష్షుడై 16 ఏళ్లకే పాము కాటుకు గురై చనిపోతాడని ఓ ముని శాపం ఇచ్చాడు.

మంగళ గౌరీ వ్రత పుణ్య ప్రభావం

అదృష్టవశాత్తూ 16 సంవత్సరాల వయస్సులోపు ఆ కుమారుడు మంగళ గౌరీ వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మంగళ గౌరీ వ్రతం పుణ్య ప్రభావం కారణంగా ఆ యువతికి మంగళ గౌరీ ఆశీస్సులు ఉన్నాయి. ఆమె వైవాహిక జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని ఆశీర్వాదం పొందింది. ఈ వ్రత మహిమ వలన ధర్మపాలుడి కుమారుని వయస్సు 100 సంవత్సరాలకు పెరిగింది.

మంగళ గౌరీ వ్రతం మొదలు

అప్పటి నుంచి మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభోత్సవంగా భావిస్తారు. కొత్తగా పెళ్లయిన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తద్వారా వారు కూడా అఖండ సౌభాగ్యాన్ని, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందగలరు. ఉపవాసం పాటించలేని స్త్రీలు కూడా ఈ రోజు పూజ చేస్తారు.

మంగళ గౌరీ హారతితో పూజను ముగించండి. ఓ దేవీ మంగళ గౌరి మంగళ హారతి ప్రేమతో గైకొనవమ్మ మాయమ్మ

ఓ దేవీ మంగళ గౌరి మంగళ హారతి ప్రేమతో గైకొనవమ్మ మాయమ్మ

పంచామృతములు, ఫలహారములను

నైవేద్యములిచ్చితిమి

పలుపలు విధముల పకువన్నములను

ప్రేమతో సమకూర్చితిమి,

నీకొరకై ప్రేమతో సమకూర్చితిమి

ఓ మాతా విను మా గాధా

మా కోరికలన్నియు తీర్చుమా

గైకొనవమ్మ మాయమ్మ || ఓ దేవీ ||

సకల సుఖములను, సౌభాగ్యములను

ఒసగుము ఓ జననీ

శుభసంతానమునిచ్చియు కరుణించుము కదలమణి

దయగనుమ, మా మొర వినుమా

ఇక పాతివ్రత్యము నీయుమ

గైకొనవమ్మ మాయమ్మ || ఓ దేవీ ||

భవభయహారిణి, వరదాయనివని

జనులందరు కొలిచెదరు

సంతతి ధారిణి దుఖః నివారిణి

మనసున పూజించెదరు

మృదువాణి, పంకజపాణి

గొవిందుని హృదయ నివాసిని

గైకొనవమ్మ మాయమ్మ || ఓ దేవీ ||

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు