Kanipakam Temple: నెట్టింట్లో కాణిపాకం వినాయకుడి మూలవిరాట్ ఫోటో వైరల్.. సెక్యూరిటీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలోని వినాయకుడి మూలవిరాట్ ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి మూల విరాట్ విగ్రహం ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
హిందూ సనాతన ధర్మంలో కొన్ని పుణ్యక్షేత్రాల్లోని మూల విరాట్ విగ్రహాన్ని ఫోటోలు తీయడం నిషేధం.. దీనికి కారణం ఆలయ స్వచ్ఛతను కాపాడడంతో గుడిలోపలకు అడుగు పెట్టి దైవ దర్శనం మీద తప్ప, వేరేవాటిమీద ఆలోచనలు చేయకుండా ఉండడం వంటి కారణాలు ఉన్నాయని చెబుతారు. అందుకనే తిరుమల, కాణిపాకం , ఇంద్రకీలాద్రి, సింహాచలం ఇలా ఏ హిందూ పుణ్యక్షేత్రాల్లో మూలవిరాట్ విగ్రహాన్ని ఫోటో తీయడానికి అనుమతినివ్వరు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలోని వినాయకుడి మూలవిరాట్ ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి మూల విరాట్ విగ్రహం ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంభుగా వెలిసిన వినాయకుడి విగ్రహాన్ని ఫోటో తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి దంపతులు… రెండు రోజుల క్రితం కాణిపాకం ఆలయ దర్శనానికి వచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంకటడ్డితో పాటు అతని అనుచరులు మొబైల్ ఫోన్ తో అంతరాలయం వరకు వెళ్లారు.. ఈ సమయంలో తమ చేతిలో ఉన్న మొబైల్‌తో మూలవిరాట్ విగ్రహాన్ని వెంకటరెడ్డి అనుచరులు ఫోటోలు తీశారు. ఫోటో తీస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది, నిర్వహికులు ఎటువంటి అభ్యంతరం చెప్పనట్లు తెలుస్తోంది. ఈ అనుచరులు తాము తీసిన సిద్ది వినాయకుడు ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఇది ఆలయాధికారులు సిబ్బంది పని తీరు.. సెక్యూరిటీ వైఫల్యం అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్ మీడియాలో వినాయకుడి విగ్రహ ఫోటోలను డిలీట్ చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..