Bhishma Niti: ఎవరైనా కష్టంలో ఉంటే చెప్పే మాటల్లో ఉన్న వెనుక అర్ధాన్ని చూసి నిర్ణయం తీసుకోమంటున్న భీష్మ నీతి

భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజు కి చేసిన ఉపదేశాలు శాంతిపర్వం భాగంలో నిండి ఉన్నాయి. ఈ శాంతి పర్వం మహాభారతం లోనే ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది.  నేటికీ భీష్మనీతి అనుసారణీయం.. ఈ రోజు భీష్ముడు పాండవులకు చెప్పిన మనిషి మాటల వెనుక అర్థాన్ని చూడండి అనే కథ గురించి తెలుసుకుందాం.. 

Bhishma Niti: ఎవరైనా కష్టంలో ఉంటే చెప్పే మాటల్లో ఉన్న వెనుక అర్ధాన్ని చూసి నిర్ణయం తీసుకోమంటున్న భీష్మ నీతి
Bhishma Niti
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2023 | 11:32 AM

మహాభారతంలో కురు వృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి..  మృత్యువు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో దైవ ప్రార్ధన చేస్తూ.. పాండవులకు పాలన, మనిషి నడవడిక జీవితానికి సంబంధించిన ధర్మోపదేశాలను తెలియజేశాడు. ఈ సమయంలో ధర్మరాజు కు భీష్ముడు రాజనీతి గురించి అనేక ఉపదేశాలను కథల రూపంలో వెల్లడించాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజు కి చేసిన ఉపదేశాలు శాంతిపర్వం భాగంలో నిండి ఉన్నాయి. ఈ శాంతి పర్వం మహాభారతం లోనే ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది.  నేటికీ భీష్మనీతి అనుసరణీయం.. ఈ రోజు భీష్ముడు పాండవులకు చెప్పిన మనిషి మాటల వెనుక అర్థాన్ని చూడండి అనే కథ గురించి తెలుసుకుందాం..

పూర్వం విదిశాపట్నంలో ఒక బ్రాహ్మణు కుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని చిన్నారి బాలుడు అర్థంతరంగా మరణించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. తీరని దుఃఖంతో భార్యాభర్తలు తమ చిన్నారి శవంతో స్మశానానికి చేరుకున్నారు. శ్మశానంలో మృతదేహాన్ని వదిలి వేయడానికి మనసు రాలేదు.. మరోవైపు తీరని దుఃఖం ఇంతకీ తరగడం లేదు. అయితే బాలుడి శవాన్ని అక్కడే ఉన్న ఓ గద్ద చూసింది. బాలుడి శవాన్ని తల్లిదండ్రులు వదిలి వెళ్తే.. తినాలనే కోరిక కలిగింది. రాత్రి తాను సంచరించలేదు కనుక.. పగలు తినాలని భావించింది. అయితే ఆ బాలుడి తల్లిదండ్రుల శవాన్ని వదిలి వెళ్లడం లేదు. ఎలా అని ఆలోచించింది. మెల్లగా ఆ కుటుంబం దగ్గరకి చేరింది.. ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటిపడితే భూతప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి. కనుక ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి అంటూ బ్రాహ్మణ దంపతులకు చెప్పింది.

అదే సమయంలో అటుగా ఓ నక్క వచ్చింది. అది కూడా బాలుడి శవాన్ని చూసింది. అంతేకాదు..అక్కడే కాచుకున్న గుద్దను కూడా చూసింది. దీంతో ఎలాగైనా ఆ బాలుడి తల్లిదండ్రులు చీకటి పడే వరకూ అక్కడే ఉంటె.. చీకటి పడిన తర్వాత తాను ఆ శవాన్ని తినవచ్చు అని ఆలోచించింది. వెంటనే  బ్రాహ్మణ దంపతుల వద్దకు వచ్చి ఈ పిల్లవాడిని వదిలివెళ్లడానికి మీకు మనసెలా ఒప్పుతోంది. కొంచెం సేపు చూడండి… మళ్ళీ ఇంకెప్పుడూ చూడలేరు కదా.. అయినా ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు. ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా అని నక్క ఆ బ్రాహ్మణ దంపతులతో చెప్పింది.

ఇవి కూడా చదవండి

శవాన్ని తినడానికి తల్లిదండ్రులని పంపేందుకు గద్దా, ఆపేందుకు నక్కా కంకణం కట్టుకున్నాయి. దీంతో గ్రద్ద.. నేను వందల ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను.. ఇప్పటి వరకు చచ్చిన వారు తిరిగి బతికింది లేదు.. ఈ నక్క మాటలు విని.. ఆశపెట్టుకోకండి అంటూ ఆ బ్రాహ్మణ దంపతులతో చెప్పింది. ఆ గ్రద్ద మాటల్లో నిజం ఉందని భావించి ఆ పిల్లాడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి ఇంటికి వెళ్ళడానికి ఉపక్రమించారు.

అయితే నక్క వెంటనే..  బ్రాహ్మణ కుటుంబంతో.. ’ఈ గద్ద మనసు మహా క్రూరమైంది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుడిని బతికించిన కథ వినలేదా! సృంజయుడి కుమారుడైన సువర్ణష్టీవిని, నారదుడు బతికించలేదా.. అదే విధంగా మీ కుమారుడిని ఏ దైవమో, యక్షుడో బతికిస్తాడేమో అంటూ చెప్పింది.

ఇలా ఈ రెండు తమకు తగిన వాదనను ఆ బ్రాహ్మణ కుటుంబానికి చెబుతున్నాయి. అదే సమయంలో శివయ్య రుద్రభూమిలో విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబపు దీనావస్థను చూసి అక్కడికి వచ్చాడు. అసలు విషయం తెలుసుకుని బ్రాహ్మణ దంపతులను మీకేం కావాలో కోరుకోమన్నాడు. ఆ భార్యాభర్తలు తమ కుమారుడిని బతికించమని కోరుకున్నారు. శివుడు మరణించిన బాలుడికి ప్రాణం పోశాడు. అంతేకాదు గద్ద, నక్కల పాప కర్మను తెలుసుకుని.. వాటికీ ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయని వరమిచ్చాడు. దీంతో ఆ కథ సుఖాంతమైంది.

ఈ కథలో నీతి ఏమిటంటే.. మన ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎవరైనా చెప్పే ప్రతిమాటా మన మంచి కోసమే అని నమ్మకూడదు. పరిస్థితుల బట్టి లౌక్యాన్ని ప్రదర్శించాలి. ఎదుటివారి కష్టాన్ని చూసి కపటమైన వారు పరిస్థితులకు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. తియ్యటి మాటలతో తమ పథకాన్ని అమలుచేస్తుంటారు. ఆ కపటత్వాన్ని మనం గ్రహించగలగాలి. వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి ఇదే రాజు యొక్క ముఖ్య ధర్మం అని చెప్పాడు భీష్ముడు.  ఇది సనాతన ధర్మం నుంచి సంగ్రహించిన కథ..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)